ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని పూజించే ఆలయం.. కామాఖ్యాదేవి శక్తిపీఠం
సతీదేవి యోని భాగం ఇక్కడ పడడంతో ఈ ప్రదేశం కామాఖ్య ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

Kamakhya Devi Temple
Kamakhya Devi: అసోంలోని గువాహటీలో కామాఖ్యాదేవిగా ఆదిపరాశక్తి వెలసింది. దక్షయజ్ఞం తర్వాత ఈ ప్రాంతంలోని నీలాచల పర్వత శిఖరంపై అమ్మవారి యోని భాగం పడింది. అమ్మవారు శక్తి స్వరూపిణిగా వెలసిన క్షేత్రం కామాఖ్యాదేవి మందిరమని హిందువులు నమ్ముతారు. అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత శక్తిమంతమైనదిగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం.
ఈ శక్తిపీఠం చాలా మహిమ గల పుణ్యక్షేత్రమని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రంలోని పూజకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననాంగాన్ని ఇక్కడ పూజిస్తారు.
కామాఖ్య దేవాలయం శివుడు, సతీదేవిల శృంగారభరితమైన ప్రదేశమని కొందరు భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆ ప్రాంతానికి కామాఖ్య అని పేరు పెట్టారు. కామాఖ్యా దేవి రక్తస్రావం దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ రాతిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని చెబుతారు. (Kamakhya Devi)
ఈ శిలారూపంపై తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్యాదేవీకి నెలలో మూడు రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. ఈ రోజుల్లో యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది.
ఈ ఎర్రని స్రావం శక్తిపీఠం ముందున్న సౌభాగ్య కుండంలోని నీరుగా చెబుతారు. మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలు పెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకూ అమ్మవారి ఋతు స్రావం జరిగే ప్రత్యేక రోజులు. ఈ మూడు రోజులు ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో అక్కడకు వెళ్లడానికి చాలా మంది భయపడతారు.
నాలుగో రోజు పెద్ద ఎత్తులో ఉత్సవం నిర్వహించి గుడి తలుపులు తెరుస్తారు. అంతకు ముందే చాలా మంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం పద్ధతిలో విక్రయిస్తారు. ఆ వస్త్రాలు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటీ పడతారు. ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, రజస్వల అయిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం.
ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా స్వాగత ద్వారం ఎదురవుతుంది. ఈ స్వాగత ద్వారం ఎంతో ఆకర్షణీయంగా చక్కగా చెక్కిన శిల్పాలతో చూడముచ్చటగా కనిపిస్తూ భక్తులను అమ్మవారి దర్శనానికి రమ్మని ఆహ్వానిస్తున్నట్లుంటుంది. స్వాగత ద్వారాన్ని దాటుకుని ముందుకు వెళితే అక్కడ స్థూపాకారంలో ఉన్న గోపురాలతో ఆలయం దర్శనమిస్తుంది. ఆలయం గోపురాలు, లోపలి శిల్ప సంపద అలనాటి సౌందర్యాన్ని చవి చూపిస్తుంటాయి. ఇక్కడ పెద్దగా ఉన్న గోపురం ఉన్న మందిరంలోనే కామాఖ్యాదేవి కొలువు దీరి ఉంది.