Ganesha Idol: ఇంట్లో వినాయకుడి విగ్రహం పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..!
వినాయకుడి విగ్రహం విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలకు దారితీయవచ్చట. (Ganesha Idol)

Ganesha Idol: హిందువుల ముఖ్యమైన పండుగల్లో వినాయకచవితి ఒకటి. హిందువుల సంస్కృతిలో పండుగలు, శుభకార్యాల్లో తొలి పూజ గణనాధుడికే. ప్రతి సంవత్సరం వినాయక చవితిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. వాడవాడలా విగ్రహాలు ఏర్పాటు చేసి భక్తిశ్రద్దలతో కొలుస్తారు.
దేశమంతా వినాయక చవితి సంబరాలు మొదలైపోయాయి. ఎక్కడ చూసినా గణనాధుడి మండపాలే కనిపిస్తున్నాయి. భిన్న రూపాల్లో గణనాధులు కొలువుదీరారు. ఇక ఇళ్లలో కూడా బొజ్జ గణపయ్య విగ్రహం పెట్టి పూజలు చేస్తారు. ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి. వినాయకుడి విగ్రహం ఇంట్లో ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది చాలా ముఖ్యం అంటున్నారు పండితులు.
ఎందుకంటే విగ్రహాన్ని ఇంట్లో పెట్టే విధానమే శుభ ఫలితాలు ఇస్తుందా లేదా నెగిటివ్ ఎనర్జీని తెస్తుందా అనేది నిర్ణయిస్తుందట. వాస్తు శాస్త్రం ప్రకారం, వినాయకుడి విగ్రహం విషయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలకు దారితీయవచ్చట. అందుకే, గణపతిని ప్రతిష్టించే ముందు ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోవాలంటున్నారు.
ఈ మూల చాలా మంచిది..!
వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య మూలలో పెట్టడం చాలా మంచిదంటున్నారు పండితులు. ఈ దిశ ఆధ్యాత్మిక ఎదుగుదలను, స్వచ్ఛమైన పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుందట. ఒకవేళ అక్కడ సాధ్యం కాకపోతే ఉత్తరం దిశలో పెడితే సంపద, పడమర దిశలో పెడితే జీవితంలో నిలకడ వస్తాయిట. విగ్రహం ముఖం ఎప్పుడూ ఉత్తరం లేదా తూర్పు వైపే చూస్తూ ఉండాలట. పొరపాటున కూడా దక్షిణం వైపు చూడకూడదు. ఎందుకంటే దక్షిణం యముడి స్థానం కాబట్టి, అది నెగిటివ్ వైబ్రేషన్స్‌ను క్రియేట్ చేస్తుందట.
ఈ ప్రాంతాల్లో అస్సలు పెట్టొద్దు..
గణేశుడి విగ్రహాన్ని బెడ్‌రూమ్‌లో అస్సలు పెట్టకూడదు. ఇది దంపతుల మధ్య ప్రశాంతతను దెబ్బతీస్తుందట. అలాగే బాత్ రూమ్ లు, స్టోర్ రూమ్స్, గ్యారేజ్‌లు లేదా మెట్ల కింద పెట్టడం మహా దోషని పండితులు హెచ్చరించారు. ఎందుకంటే ఈ ప్రదేశాలలో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందట. చీకటిగా ఉండే మూలల్లో కూడా పెట్టరాదు. పూజ గది, లివింగ్ రూమ్, లేదా ఇంటి మెయిన్ డోర్ దగ్గర శుభ్రంగా, మంచి వెలుతురు ఉన్న చోట పెట్టాలంటున్నారు.
తొండం ఎటువైపు ఉండాలి..
ఇంట్లో పెట్టుకోవడానికి ఎడమ వైపుకు తిరిగిన తొండం ఉన్న విగ్రహం చాలా మంచిది. ఇది శాంతికి, కుటుంబంలో అన్యోన్యతకు చిహ్నం. కుడి వైపుకు తిరిగిన తొండం ఉన్న విగ్రహం చాలా శక్తిమంతమైనది. దీనికి కఠినమైన పూజా నియమాలు పాటించాలి.
నాట్యం చేసే గణపతి విగ్రహాలను ఇంట్లో పెట్టకూడదు. అవి ఇంట్లో అశాంతిని, మనసులో నిలకడ లేని తనాన్ని పెంచుతాయని నమ్ముతారు. కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహం ఉత్తమం. ఇది ప్రశాంతతను, జీవితంలో స్థిరత్వాన్ని, సంపదను తెస్తుందని నమ్మకం.
ఎలాంటి విగ్రహాలు ఎంచుకోవాలి?
ఇత్తడి, కంచు, మట్టి లేదా చెక్క వంటి నేచురల్ మెటీరియల్స్‌తో చేసిన విగ్రహాలనే ఎంచుకోవాలి. ప్లాస్టిక్ లేదా సింథటిక్ విగ్రహాలకు దూరంగా ఉండాలి. రోజూ సులభంగా పూజ చేయడానికి వీలుగా విగ్రహం చిన్నదిగా ఉండాలి. గౌరవ సూచకంగా మన కంటికి సమానమైన ఎత్తులో (3-5 అడుగుల ఎత్తులో) పెట్టాలి. విగ్రహంతో పాటు స్వామి వాహనం ఎలుక, నైవేద్యం మోదకం కూడా తప్పకుండా ఉండాలి.
Also Read: వినాయకుడి దంతం ఎలా విరిగింది? గణేశుడు ఏకదంతుడు ఎలా అయ్యాడు?