Airtel SIM Cards : ఎయిర్‌టెల్ బ్లింకిట్ బిగ్ డీల్.. కూరగాయలు, స్మార్ట్‌ఫోన్లే కాదు.. 10 నిమిషాల్లో ఇంటికే సిమ్ కార్డులు డెలివరీ!
Airtel SIM Cards : భారతీ ఎయిర్‌టెల్ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ భాగస్వామ్యంతో కేవలం 10 నిమిషాల్లోనే వినియోగదారుల ఇంటి వద్దకే సిమ్ కార్డులను డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది.

Airtel SIM Cards
Airtel SIM Cards : ప్రస్తుత రోజుల్లో క్విక్ కామర్స్ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. కిరాణా సరుకులు, కూరగాయలు మాత్రమే కాదు.. ఇప్పుడు ఏకంగా సిమ్ కార్డులను కూడా డెలివరీ చేయనున్నాయి. ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ జొమాటోకి చెందిన బ్లింకిట్ సంస్థ ఈ సరికొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇకపై ఎయిర్‌టెల్ కస్టమర్లకు సిమ్ కార్డులను కూడా డెలివరీ చేయనుంది. దేశీయ టెలికాం రంగంలో తొలిసారిగా 10 నిమిషాల్లో సిమ్ కార్డ్ డెలివరీని చేయనుంది.
16 నగరాల్లో సిమ్ డెలివరీ సర్వీసులు :
ఈ సర్వీసులు ఇప్పుడు దేశంలోని 16 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కాలక్రమేణా మరిన్ని నగరాలు, పట్టణాల్లో విస్తరించేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రారంభ దశలో సిమ్ డెలివరీ సర్వీసులు ఢిల్లీ, గుర్గావ్, ఫరీదాబాద్, సోనిపట్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై, భోపాల్, ఇండోర్, బెంగళూరు, ముంబై, పూణే, లక్నో, జైపూర్, కోల్‌కతా, హైదరాబాద్ వంటి మహానగరాలతో సహా 16 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంటుంది. “ఈ భాగస్వామ్యంతో వినియోగదారులు రూ. 49 నామమాత్రపు రుసుముతో కనీసం 10 నిమిషాల్లో వారి ఇంటి వద్ద సిమ్ కార్డులను పొందవచ్చు” అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
టెలికాం దిగ్గజం ప్రకారం.. సిమ్ కార్డ్ డెలివరీ తర్వాత కస్టమర్లు ఆధార్ ఆధారిత కేవైసీ అధెంటికేషన్ ద్వారా యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. తద్వారా సిమ్ కార్డు నంబర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.
కస్టమర్లు పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్‌ల నుంచి ఎంచుకునే అవకాశం లేదా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోకి పోర్టింగ్ కోసం MNP ట్రిగ్గర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ కోసం కస్టమర్‌లు ఆన్‌లైన్ లింక్‌ను యాక్సెస్ చేయవచ్చు. యాక్టివేషన్ కోసం యాక్టివేషన్ వీడియోను కూడా చూడొచ్చు.
అదనంగా, ఎయిర్‌టెల్ యూజర్లందరూ తమకు అవసరమైన ఏదైనా హెల్ప్ కోసం ‘ఎయిర్‌టెల్ థాంక్స్’ యాప్ ద్వారా కస్టమర్‌కేర్ సెంటర్ సౌకర్యవంతంగా యాక్సెస్ చేయవచ్చు. హెల్ప్ కోరుకునే కొత్త వినియోగదారులు (9810012345)కు డయల్ చేయడం ద్వారా కస్టమర్ కేర్‌ను కూడా సంప్రదించవచ్చు. సిమ్ కార్డ్ డెలివరీ తర్వాత వినియోగదారులు అంతరాయం లేని సర్వీసును పొందవచ్చు. ఇందుకోసం కస్టమర్లు తమ సిమ్ కార్డును 15 రోజుల్లోపు యాక్టివేట్ చేసుకోవాలి.
“ఈరోజు 16 నగరాల్లోని కస్టమర్ల ఇళ్లకు 10 నిమిషాల సిమ్ కార్డ్ డెలివరీ కోసం బ్లింకిట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కాలక్రమేణా ఈ భాగస్వామ్యాన్ని మరిన్ని నగరాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాం” అని భారతీ ఎయిర్‌టెల్ కనెక్టెడ్ హోమ్స్ సీఈఓ, మార్కెటింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు.
బ్లింకిట్‌లో సిమ్ కార్డ్‌ను ఎలా ఆర్డర్ చేయాలి? ఎలా యాక్టివేట్ చేయాలి? :
- బ్లింకిట్‌లో సిమ్ కార్డులను ఆర్డర్ చేయవచ్చు. అవసరమైన వివరాలను సమర్పించవచ్చు.
- కార్డు అందుకున్న తర్వాత సిమ్ కార్డును యాక్టివ్ చేసుకునేందుకు ఈ కింది విధంగా చేయాలి.
- KYC ప్రక్రియ కోసం మీ ఆధార్ కార్డు రెడీగా ఉంచుకోవాలి.
- యాక్టివేషన్ వీడియో యాక్సెస్ కోసం మీ సిమ్ కార్డ్ డెలివరీతో అందించిన లింక్‌ను ఫాలో అవ్వండి.
- డెలివరీ అయిన 15 రోజుల్లోపు మీ సిమ్ కార్డ్‌ను యాక్టివేట్ చేయండి.
- ఇంటి నుంచే ఆధార్ ఆధారిత KYC ప్రక్రియను పూర్తి చేయండి.
- మరో ప్రొవైడర్ నుంచి మారినట్లయితే.. ఆర్డర్ ప్రక్రియ సమయంలో MNP రిక్వెస్ట్ పెట్టుకోండి.
బ్లింకిట్‌లో ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్ ఎక్కడ పొందాలంటే? :
ప్రారంభ దశలో భాగంగా ఢిల్లీ, గుర్గావ్, ఫరీదాబాద్, సోనిపట్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై, భోపాల్, ఇండోర్, బెంగళూరు, ముంబై, పూణే, లక్నో, జైపూర్, కోల్‌కతా, హైదరాబాద్ వంటి నగరాల్లోని వినియోగదారులు సిమ్ కార్డు కోసం బ్లింకిట్‌లో ఆర్డర్ చేయవచ్చు.