నోట్ల కొరత ఇందుకేనా? : లెక్కల్లో లేని రూ.2వేల కరెన్సీ స్వాధీనం

దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్లు రద్దు నిర్ణయం అప్పట్లో సంచలనం సృష్టించింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా రూ.2వేలు నోట్లను చెలామణీలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. నోట్ల రద్దు చేసి సరిగా మూడేళ్లు అవుతోంది. అప్పటినుంచి దేశం ఆర్థిక మందగమనం దిశగా కొనసాగుతోంది.
రూ.2వేలు నోట్లు చెలమణీలో తగ్గిపోయాయి. ప్రభుత్వం కూడా రూ.2వేల నోట్ల ముద్రణ నిలిపివేసింది. క్రమంగా పబ్లిక్‌లో చెలామణీ తగ్గిపోతు వస్తోంది. రూ.2వేల నోట్ల కొరత ఏర్పడినట్టే కనిపిస్తోంది. కానీ, లెక్కల్లో లేని రూ.2వేలు నోట్లు భారీమొత్తంలో బయటపడుతున్నాయి. ఆదాయ పన్ను శాఖ నిర్వహించిన తనిఖీల్లో రూ.2వేల నోట్లను అధికమొత్తంలో స్వాధీనం చేసుకుంది.
రూ.2వేల నోట్ల తగ్గుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మంగళవారం రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ కరెన్సీ మొత్తం.. లెక్కల్లో లేని ఆదాయం, ఆస్తుల్లోకి మారినట్టుగా కనిపిస్తోంది. అందిన డేటా ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నోట్ల రద్దు నుంచి ఇప్పటివరకూ లెక్కల్లో లేని రూ.2వేల నోట్లు 43.22శాతం మేర స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.
గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే 60శాతానికి పైగా ఉందని తెలిపింది. దీనిపై మంత్రి నిర్మల రాజ్యసభలో రాతపూర్వకమైన సమాధానాన్ని ఇచ్చారు. 2017-18, 2018-19, 2019-20 (ఇప్పటివరకు) రూ.2వేల నోట్లను పలు కేసుల్లో రూ.5వేల కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.అందులో రూ.2వేల నోట్లు 67.91శాతం, 65.93శాతం, 43.22శాతంగా ఉన్నట్టు ఆమె చెప్పారు.
రూ.2వేల నోట్లను నల్లధనంగా దాచడం కారణంగానే నోట్ల చెలామణీ తగ్గినట్టు ప్రభుత్వం నొక్కి చెప్తోంది. మార్చి 2017లో రూ.2వేల కరెన్సీ నోట్లలో సగానికి పైగా చెలామణీలో ఉన్నాయి. ఇప్పుడు 31శాతానికి తగ్గిపోయింది. మార్చి 2018 నుంచి రూ.6.7 లక్షల కోట్లు చెలామణీలో ఉండగా మార్చి 2019 నాటికి రూ.6.6లక్షల కోట్లకు తగ్గినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది.
ఇటీవల ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్.. రూ.2వేల నోట్లను రద్దు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రూ.2వేలు నోట్లు చెలామణీలోకి వచ్చినప్పటి నుంచి దాచిపెట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్టు కనిపిస్తోందని అన్నారు.
ప్రస్తుతం చెలామణీలో ఉన్న రూ.2వేల నోట్లను రద్దు చేయడం ద్వారా ఎలాంటి సమస్య తలెత్తదని గార్గ్ అభిప్రాయపడ్డారు. మూడో వంతులో ఒక భాగం మాత్రమే రూ.2వేలు నోట్లు చెలామణీలో ఉన్నాయన్నారు. ప్రస్తుతం.. రూ.2వేల నోట్ల లావాదేవీలు పెద్దగా జరగడం లేదని గార్గ్ తెలిపారు.