Union Budget 2026 : ఈసారి బడ్జెట్‌లో రైతులకు వరాలు? పీఎం కిసాన్ సాయం రూ. 8వేలకు పెంపు? రైతన్నల డిమాండ్లు ఇవే..!
Union Budget 2026 : పీఎం కిసాన్ రైతులకు వచ్చే కేంద్ర బడ్జెట్ 2026లో ప్రభుత్వం వరాలు ప్రకటించనుందా? ఈసారి ఎలాంటి ప్రయోజనాలను అందించనుంది. పీఎం కిసాన్ డబ్బులు ఇకపై రూ. 8వేలకు పెంచనుందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
PM-Kisan scheme payment (Image Credit To Original Source)
Union Budget 2026 : రైతులు సహా అందరి దృష్టి ఇప్పుడు రాబోయే వార్షిక బడ్జెట్ 2026పైనే.. అన్ని రంగాల మాదిరిగానే వ్యవసాయ రంగంలో కూడా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పీఎం కిసాన్ సాయంపై ఎలాంటి నిర్ణయం ఉంటుంది అనేది ఉత్కంఠగా మారింది.
సన్నకారు, చిన్న రైతులకు అందించే రూ. 6వేల ఆర్థిక సాయం పెరగనుందా? పెట్టుబడి సాయం పెంపుపై భారీగా పెంపు ఉంటుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
పీఎం కిసాన్ సాయం రూ. 8వేలకు పెంపు? :
దేశవ్యాప్తంగా రైతులు పెట్టుబడి సాయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇందులో పీఎం కిసాన్ ఆర్థిక సాయం మొత్తాన్ని ఏటా రూ. 6వేల నుంచి రూ.8వేల పెంచాలనే డిమాండ్ ఉంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు ఏటా 3 సమాన వాయిదాలలో రూ.6వేలు అందుకుంటారు. ప్రతి విడత రైతులకు రూ. 2వేలు ఆర్థిక సాయం అందుతుంది.
ఈసారి బడ్జెట్‌లో రైతులకు ప్రయోజనాలుంటాయా.? :
ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకూ కేంద్రం ఆర్థిక సాయం మొత్తాన్ని పెంచలేదు. గత బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఏమీ అందించలేదు. కానీ, కేసీసీ (కిసాన్ క్రెడిట్ కార్డు) పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచడం ద్వారా లక్షలాది మంది రైతులకు బహుమతిని అందించారు.

PM-Kisan scheme payment (Image Credit To Original Source)
ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట సాయాన్ని పెంచేశాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుండగా, ఏపీ ప్రభుత్వం అన్నదాత సుభీభవ పథకాలతో ఆర్థిక సాయాన్ని భారీగా పెంచింది. కానీ, కేంద్రం మాత్రం ఇప్పటివరకూ పీఎం కిసాన్ పంట సాయాన్ని కొంచెం కూడా పెంచలేదు.
ఈసారి బడ్జెట్ లోనైనా పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని పెంచుతారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలకు ఇప్పటివరకూ రూ. 2వేలు చొప్పున 21 వాయిదాలను పంపింది. లబ్ధిదారులు ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు.
రైతుల డిమాండ్లు ఏంటి? :
ఈసారి బడ్జెట్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 4 నెలలకు రూ. 2వేలు అందుతున్నా ఎరువుల ఖర్చుకు చాలడం లేదని రైతులు వాపోతున్నారు. వేతనాలు భారీగా పెరిగాయని అంటున్నారు. ప్రభుత్వం పీఎం కిసాన్ వాయిదాను కనీసం రూ.3వేలకి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఏడాదిలో మొత్తం పంట సాయం రూ. 8వేలకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది.
దిగుబడి ఇన్‌పుట్ ఖర్చుల కన్నా చాలా తక్కువగా ఉందని అంటున్నారు. పీఎం కిసాన్ నిధులు వ్యవసాయ ఖర్చుల భారాన్ని కొంచెం తగ్గించినప్పటికీ, ఇప్పుడు ప్రతి ఏడాది అందించే రూ. 6వేలు ఏమాత్రం సరిపోవు. కనీసం రూ.8వేలు అందితే రైతులకు ఉపశమనం ఉంటుందని భావిస్తున్నారు.
