బడ్జెట్ 2019 : పేదల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజలను ఎలాగైనా ఆకర్షించి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే అధికార, ప్రతిపక్ష పార్టీలు అనేక హామీలను గుప్పిస్తున్నారు. మేం అధికారంలోకి వస్తే అది చేస్తాం, మేం అధికారంలోకి వస్తే ఇది చేస్తాం అంటూ ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు అనేక రకాల ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే ఈ సమయంలో రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఓ ప్రకటన దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలను షేక్ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికీ కనీస ఆదాయ పథకాన్ని తీసుకొస్తామని ప్రక్టించారు.
అయితే మరోవైపు ప్రస్తుత కేంద్రప్రభుత్వం తన చివరి బడ్జెట్ ను ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనుంది. ఈ సమయంలో రాహుల్ ప్రకటనను మించిన నిర్ణయం తీసుకొని బడ్జెట్ లో వాటిని పెట్టి ప్రజలను ఆకర్షించేందుకు మోడీ సర్కార్ రెడీ అయింది. రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ పథకానికి పోటీగా నిరుపేదలకు సార్వత్రిక కనీస ఆదాయం(UBI) పథకాన్ని తెరపైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి-1న పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ లోనే దానిని ప్రవేశపెట్టేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి రెండేళ్ల క్రితమే అప్పటి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ దీనిని ప్రతిపాదించారు. లెక్కకు మించిన పథకాలను కేంద్రం అమలుచేస్తున్నా లక్ష్యాలను చేరడం లేదని, సంక్షేమ పథకాలన్నింటిని ఎత్తివేసి కనీస ఆదాయ పథకం పేరిట నిరుపేదల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయాలని సూచించారు. సంక్షేమ పథకాల కంటే యూబీఐ శక్తివంతమైనదని, 75 శాతం మంది ఈ పథకంతో లబ్ధి పొందుతారని తెలిపారు.
అయితే ప్రపంచంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం విజయవంతంగా రన్ చేయలేని యూబీఐ స్కీమ్ ని తమ రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు సిక్కిం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఒక్క స్కీమ్ ముందు మిగిలిన అన్నీ సంక్షేమ కార్యక్రమాలు వృద్ధా అని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7లక్షల మంది జనాభా ఈ పథకం ద్వారా లబ్ది పొందటమే కాకుండా పూర్తిగా పేదరికం తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.