Diwali Bonus : ఇది కదా అసలు పండగ.. దసరా, దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 రోజుల బోనస్.. ఎవరు అర్హులు? టాప్ బోనస్ ఎంతంటే?
Diwali Bonus : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పండక్కి ముందే బోనస్ వచ్చేసింది. 30 రోజుల జీతానికి బోనస్ ప్రకటించింది.

Diwali Bonus
Diwali Bonus : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే పండగ.. దసరా, దీపావళి కానుకను ముందే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 2024-25 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నాన్-ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (అడ్ హాక్ బోనస్) ప్రకటించింది. ఈ పథకం కింద అర్హత ఉన్న ఉద్యోగులందరూ 30 రోజుల జీతానికి సమానమైన బోనస్‌ను అందుకుంటారు.
దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (Diwali Bonus) అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. గ్రూప్ సి కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ పథకానికి అర్హులుగా పేర్కొంది. అంతేకాకుండా, గ్రూప్-బి కిందకు వచ్చే అన్ని నాన్-గెజిటెడ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉత్పాదకత-సంబంధిత పథకం కిందకు రాని ఉద్యోగులు కూడా ఈ బోనస్‌ను అందుకుంటారు.
అర్హత ప్రమాణాలివే :
మార్చి 31, 2025 నాటికి సర్వీసులో ఉన్న, కనీసం 6 నెలల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులందరికీ బోనస్ వర్తిస్తుంది. పూర్తి ఏడాది కన్నా తక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులు పనిచేసిన నెలలకు అనుగుణంగా ప్రో-రేటా ప్రాతిపదికన బోనస్ అందుకుంటారు.
ఈ ఉద్యోగులు కూడా అర్హులే :
కేంద్ర పారామిలిటరీ దళాలు, సాయుధ దళాల అర్హత కలిగిన సిబ్బంది అందరూ అడ్ హాక్ బోనస్ బెనిఫిట్స్ పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ జీతాలు మరే ఇతర బోనస్ లేదా ఎక్స్-గ్రేషియా పథకం కింద అందని కేంద్ర పాలిత ప్రభుత్వాల ఉద్యోగులకు కూడా ఈ ఉత్తర్వు వర్తిస్తుంది. ఇలాంటి బోనస్ ప్రయోజనం మార్చి 31, 2025 నాటికి సర్వీసులో ఉన్న లేదా 2024-25 సంవత్సరంలో కనీసం 6 నెలలు సర్వీసును అందించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
పూర్తి సంవత్సరం సర్వీసు చేయని వారికి బోనస్ ప్రో-రేటా ప్రాతిపదికన (పనిచేసిన నెలల సంఖ్య ప్రకారమే) అందిస్తారు. సర్వీసులో గ్యాప్ లేని తాత్కాలిక ఉద్యోగులు కూడా ఈ బోనస్‌కు అర్హులు. గత 3 ఏళ్లలో అవసరమైన రోజులు పనిచేసిన సాధారణ ఉద్యోగులు కూడా బోనస్‌కు అర్హులు. వారి బోనస్‌ను రూ. 1,184గా నిర్ణయించారు. వాస్తవ నెలవారీ జీతం రూ. 1,200 కన్నా తక్కువగా ఉన్న సందర్భాల్లో తాత్కాలిక బోనస్ వాస్తవ నెలవారీ జీతం ఆధారంగా లెక్కిస్తారు. బోనస్ మొత్తం సమీప సంఖ్యతో రౌండ్ ఫిగర్ చేస్తారు.
గరిష్ట బోనస్ ఎంతంటే? :
సెప్టెంబర్ 29న జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. అడ్-హాక్ బోనస్ లెక్కించేందుకు గరిష్ట పరిమితి నెలవారీ జీతం రూ. 7వేలు. ఉద్యోగి సగటు జీతం, గరిష్ట గణన పరిమితి ఏది తక్కువైతే దాని ఆధారంగా అడ్-హాక్ బోనస్ మొత్తాన్ని లెక్కిస్తారు. ఒక ఉద్యోగి నెలకు రూ. 7వేలు పొందుతుంటే.. 30 రోజుల బోనస్ సుమారు రూ. 6907.89 అవుతుంది. ఒక రోజు అడ్-హాక్ బోనస్‌ను లెక్కిస్తే.. ఉద్యోగి ఒక ఏడాదిలో సంపాదించిన సగటు జీతాన్ని 30.4 (ఒక నెలలో సగటు రోజుల సంఖ్య)తో భాగించాలి. ఆ తర్వాత బోనస్ ఇచ్చిన రోజుల సంఖ్యతో గుణిస్తారు.
లెక్కింపు వివరాలివే :
బోనస్ గరిష్ట నెలవారీ జీతం రూ. 7వేలు ఆధారంగా లెక్కిస్తారు.
ఉదాహరణకు.. ఈ జీతంపై 30 రోజుల బోనస్ ఎలా లెక్కిస్తారంటే?
7,000 × 30 ÷ 30.4 = రూ. 6,907.89 (రూ. 6,908కి రౌండ్ ఫిగర్).
- మార్చి 31, 2025 నాటికి సర్వీసులో ఉన్న ఉద్యోగులు మాత్రమే అర్హులు.
- పదవీ విరమణ చేసిన లేదా రిజైన్ చేసిన లేదా మరణించిన ఉద్యోగులు కనీసం 6 నెలల సాధారణ సర్వీసును పూర్తి చేసి ఉంటేనే అర్హులు.
- డిప్యుటేషన్ పై ఉన్న ఉద్యోగులు వారి ప్రస్తుత సంస్థ నుంచి బోనస్ అందుకుంటారు.