ట్రాన్ జెక్షన్ ఫెయిల్ అయిందా? : బ్యాంకులే కస్టమర్లకు రోజుకు రూ.100 చెల్లించాలి

అకౌంట్లో డబ్బులు తీయాలి.. ఏ చేస్తాం.. వెంటనే దగ్గరలోని ఏటీఎం దగ్గరకు పరిగెత్తుతాం. తీరా ఏటీఎంలో క్యాష్ లేదని తెలిసి తిట్టుకుంటాం. ఒకవేళ క్యాష్ ఉన్నా ట్రాన్ జెక్షన్ ఫెయిల్ కావడం లేదా ట్రాన్ జెక్షన్ టైమ్ ఔట్ అయి డబ్బులు రాకుంటే తెగ వర్రీ అవుతాం.. ఇలాంటి పరిస్థితి చాలామందికి ఎదురయ్యే ఉంటుంది.
సాధారణంగా ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా చేసే సమయంలో కొన్నిసార్లు ట్రాన్ జెక్షన్ ఫెయిల్ అయి.. అకౌంట్లో డబ్బులు కట్ అవుతుంటాయి. ట్రాన్ జెక్షన్ ఫెయిల్ అయితే.. ఆరోజు నుంచి ఆరు పనిదినాల్లో వెంటనే కట్ అయిన నగదు తిరిగి ఖాతాదారుడి అకౌంట్లోకి ఫిక్స్ డ్ టర్న్ అరౌండ్ టైమ్ (TAT) రీవర్స్ డిపాజిట్ కావాలి.
ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం.. డెడ్ లైన్ ముగిసినప్పటికీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ కాని సందర్భాల్లో బ్యాంకులు తమ కస్టమర్లకు రూ.వంద నుంచి ఆపైనా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆరు రోజుల (T+5 రోజులు) డెడ్ లైన్ దాటినా డబ్బులు క్రెడిట్ కాకుంటే మాత్రం ఎన్నిరోజులు ఆలస్యమైతే బ్యాంకులు కస్టమర్లకు నష్టపరిహారంగా రోజుకు రూ.వంద చొప్పున చెల్లించాల్సిందిగా ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది.
Card, PoS, CNP, IMPS, UPI, AEPS, ABPS, NACH, PPIలతో ఏటీఎంల్లో ట్రాన్ జెక్షన్ ఫెయిల్ అయిన సందర్భాల్లో కస్టమర్ల అకౌంట్లకు కట్ అయిన నగదు తిరిగి డిపాజిట్ అయ్యేలా ఆర్బీఐ సర్క్యూలర్ వివిధ టైమ్ లైన్లను ఫిక్స్ చేసింది. కస్టమర్ నుంచి దరఖాస్తు లేదా ఫిర్యాదు కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కస్టమర్ల అకౌంట్లకు సుమోటోగా నష్టపరిహారాన్ని బ్యాంకులు చెల్లించాలని సెంట్రల్ బ్యాంకు తెలిపింది. ఒకవేళ కస్టమర్ బ్యాంకు నుంచి నగదు తిరిగి జమ కాని సందర్భాల్లో.. బ్యాంకింగ్ ఆర్బీఐ స్వతంత్ర న్యాయాధికారికి ఫిర్యాదు చేయవచ్చు.