భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కొత్త శకం ప్రారంభం.. టెస్లా, విన్‌ఫాస్ట్, బీవైడీ రయ్ రయ్.. అన్నీ ఖతర్నాక్ కార్లే.. ఈ మూడింట్లో ఏది కిర్రాక్?
ఈ పోటీ వల్ల భారత వినియోగదారులకు నాణ్యమైన, అందుబాటు ధరలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు లభించనున్నాయి.

భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కొత్త శకం ప్రారంభమైంది. దశాబ్ద కాలపు నిరీక్షణకు తెరదించుతూ అమెరికా దిగ్గజం టెస్లా అడుగుపెట్టగా, వియత్నాం నుంచి విన్‌ఫాస్ట్, చైనా నుంచి BYD కూడా తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యాయి. ఈ మూడు విదేశీ బ్రాండ్ల రాకతో భారత్‌లో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఈ కంపెనీల వ్యూహాలేంటి? ఏ కారులో ఏముంది? మీ బడ్జెట్‌కు ఏది సరిపోతుంది? వివరంగా తెలుసుకుందాం..
టెస్లా
ఎట్టకేలకు టెస్లా భారత మార్కెట్లోకి వచ్చేసింది. ముంబైలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించిన టెస్లా.. త్వరలో ఢిల్లీ-NCR లో కూడా విస్తరించనుంది.
టెస్లా ప్రస్తుతానికి తన కార్లను పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందుకే ధరలు ప్రీమియం సెగ్మెంట్‌లో ఉన్నాయి. రూ. 22,000తో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే, ఈ మొత్తం వాపసు ఇవ్వరు.
దీని ధరల కారణంగా, ఇది BMW, వోల్వో, మెర్సిడెస్-బెంజ్ వంటి లగ్జరీ EV బ్రాండ్లతో పోటీ పడుతుంది.
టెస్లా మోడల్ Y (Tesla Model Y)
ధర: రూ.59.89 లక్షల నుంచి రూ.67.89 లక్షల మధ్య
రేంజ్: ఒకసారి ఛార్జ్ చేస్తే 622 కి.మీ. వరకు ప్రయాణం (లాంగ్-రేంజ్ వేరియంట్)
ప్రత్యేకతలు: సరికొత్త టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసుకునే బ్యాక్ సీట్లు, 0-100 కి.మీ. వేగాన్ని కేవలం 5.6 సెకన్లలో అందుకునే సామర్థ్యం.
విన్‌ఫాస్ట్: “మేడ్ ఇన్ ఇండియా” ప్లాన్‌తో దూకుడు
వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్, టెస్లాకు పూర్తి భిన్నమైన వ్యూహంతో వస్తోంది. దిగుమతులపై ఆధారపడకుండా, తమిళనాడులో ఏకంగా $2 బిలియన్ల పెట్టుబడితో సొంతంగా ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల ధరలు కాస్త తక్కువగా ఉంటాయి.
కేవలం రూ.21,000తో ప్రీ-బుకింగ్స్ ప్రారంభం, ఈ మొత్తం పూర్తిగా వాపసు ఇస్తారు. మధ్యతరగతి EV సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంది.
విన్‌ఫాస్ట్ VF6, VF7 (VinFast VF6 and VF7 Models):
అంచనా ధర: రూ.18 లక్షల నుంచి రూ.24 లక్షలు.
రేంజ్: సుమారు 440 కి.మీ.
ప్రత్యేకతలు: ఇది ఒక కాంపాక్ట్ SUV. Level 2 ADAS, పనోరమిక్ రూఫ్, కనెక్టెడ్ ఫీచర్లతో వస్తోంది. ఇది MG ZS EV, హ్యుందాయ్ క్రెటా EV వంటి వాటికి గట్టి పోటీ ఇస్తుంది.
BYD: మార్కెట్‌లో ఇప్పటికే పాగా వేసిన చైనా దిగ్గజం
టెస్లా, విన్‌ఫాస్ట్ రాకముందే భారత మార్కెట్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న బ్రాండ్ BYD. ఇప్పటికే 3,500 యూనిట్లకు పైగా అమ్మి, మార్కెట్‌లో నమ్మకాన్ని సంపాదించింది. బడ్జెట్ నుంచి ప్రీమియం వరకు వివిధ సెగ్మెంట్లలో మోడళ్లను అందిస్తోంది.
మోడళ్లు: Sealion 7, Atto 3, Seal, eMax 7 వంటి విభిన్న మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
BYD కీలక మోడళ్లు
BYD Atto 3: రూ.24.99 లక్షల ప్రారంభ ధరతో, 420 కి.మీ. రేంజ్‌తో మధ్యతరగతిలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్.
BYD Sealion 7: రూ.48.90 లక్షల ధరతో, 567 కి.మీ. రేంజ్‌తో టెస్లాకు ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇస్తుంది.
ఫీచర్ | టెస్లా మోడల్ Y | విన్‌ఫాస్ట్ VF6, VF7(అంచనా) | BYD Atto 3 |
---|---|---|---|
సెగ్మెంట్ | లగ్జరీ SUV | కాంపాక్ట్ SUV | ప్రీమియం కాంపాక్ట్ SUV |
ప్రారంభ ధర | రూ.59.89 లక్షలు | రూ.18 లక్షలు | రూ.24.99 లక్షలు |
రేంజ్ | 622 కి.మీ. వరకు | 440 కి.మీ. వరకు | 420 కి.మీ. వరకు |
వ్యూహం | దిగుమతి | స్థానిక ఉత్పత్తి | స్థానిక అసెంబ్లీ |
ఎవరికి బెస్ట్? | ప్రీమియం, బ్రాండ్ వాల్యూ కోరుకునేవారికి | బడ్జెట్‌లో ఫీచర్లు కోరుకునేవారికి | నాణ్యత, విశ్వసనీయత కోరుకునేవారికి |
టెస్లా రాకతో భారత EV మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్ ఊపందుకుంటుండగా, విన్‌ఫాస్ట్, BYD వంటి కంపెనీలు తమ “మేడ్ ఇన్ ఇండియా” వ్యూహాలతో మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పోటీ వల్ల భారత వినియోగదారులకు నాణ్యమైన, అందుబాటు ధరలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లు లభించనున్నాయి.