Gold prices: వామ్మో.. బంగారం ధరలు ఏ మేరకు పెరగనున్నాయంటే? ఇప్పుడే కొనేసుకుంటే..
ఎగుమతులపై ఆధారపడి ఉన్న యూరప్, ఆసియాలోని మార్కెట్ రంగాల్లో మరింత ఒత్తిడి కనిపిస్తోంది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు మరింత పెరగనున్నాయి. వచ్చే 18 నెలల్లో బంగారం ధరలు ఒక ఔన్సుకు $3,500 మార్కును చేరే అవకాశముందని BofA సెక్యూరిటీస్ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న బంగారం ధరలతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కవ. అంతర్జాతీయ అస్థిరతలు, పెట్టుబడి డిమాండ్, ఆర్థిక సంక్షోభం, కేంద్ర బ్యాంకుల విధానాలు వంటి అంశాల వల్ల బంగారం ధర పెరుగుతోందని BofA సెక్యూరిటీస్ సంస్థ వెల్లడించింది.
అమెరికా ట్రేడ్ పాలసీలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు డాలర్ విలువను దెబ్బతీయవచ్చు. ఇది తాత్కాలికంగా అయినా బంగారం ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, అమెరికా ప్రభుత్వ ఆదాయానికి మించి ఖర్చులు పెరిగితే ఆ లోటును తగ్గించేందుకు తీసుకునే ఆర్థిక చర్యలు, విధానాలు బంగారం ధరను ప్రభావితం చేసి, పెంచే అవకాశం ఉంది.
“ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు ప్రస్తుతం తమ రిజర్వ్ లేదా నిల్వలలో 10% బంగారాన్ని ఉంచుకున్నాయి. దీన్ని 30% వరకు పెంచుకోవచ్చు. తద్వారా వారి పెట్టుబడి పోర్ట్‌ఫోలియో మరింత సమర్థవంతంగా మారుతుంది. ఇక, రిటైల్ పెట్టుబడిదారులు కూడా బంగారంపై ఆసక్తి పెంచుకున్నారు. అమెరికా, యూరప్, ఆసియాలో భౌతిక బంగారం ఆధారిత ETFలలో నిర్వహణలో ఉన్న ఆస్తులు సంవత్సరాంతానికి 4% పెరిగాయి” అని BofA పేర్కొంది.
అలాగే, ఏప్రిల్ 2న ట్రంప్ చేసే ప్రకటన కూడా బంగారం ధరలపై ప్రభావం చూపవచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో బంగారం వృద్ధిని కనబరిచింది. దాదాపు 38% పెరుగుదల నమోదైంది. ముఖ్యంగా వాణిజ్య విధాన భయాలు పెట్టుబడిదారులను సురక్షితమైన ఆస్తుల వైపు ఆకర్షించాయి. BofA గతంలో బంగారం ధర $3,000/ఔన్స్‌కు చేరుతుందని అంచనా వేసింది. ఇటీవలే బంగారం ధర దాన్ని దాటిపోయింది.
2025లో బంగారం సగటు ధర $3,000/ఔన్స్‌కు చేరాలంటే, పెట్టుబడి డిమాండ్ కేవలం 1% పెరగాల్సి ఉంటుంది. కానీ $3,500/ఔన్స్ మార్కును అందుకోవాలంటే, డిమాండ్ 10% పెరగాల్సి ఉంటుంది. ఇది భారీ లక్ష్యం అయినప్పటికీ, సాధ్యమేనని నిపుణులు భావిస్తున్నారు.
చైనా ఫైనాన్షియల్ సూపర్విజన్ అడ్మినిస్ట్రేషన్ బీమా నిధులను బంగారం కొనుగోలులో ఉపయోగించేందుకు ప్రయోగాత్మకంగా ప్రణాళికను ప్రారంభించింది. ఇందులో బంగారం స్పాట్ కాంట్రాక్టులు, డిఫర్డ్ డెలివరీ కాంట్రాక్టులు, షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్‌లోని వివిధ ఒప్పందాలపై పెట్టుబడులకు అనుమతి ఉంది.
తగ్గుతున్న వడ్డీ రేట్ల కారణంగా బీమా సంస్థలు అధిక రాబడి పొందే ప్రత్యామ్నాయాలకు మొగ్గు చూపుతున్నాయి. దీని ఫలితంగా, చైనా బీమా సంస్థలు సుమారు 300 టన్నుల బంగారం కొనుగోలు చేయవచ్చు.
“అమెరికా ఈక్విటీ ఫ్యూచర్స్ దిగజారాయి, యూరోపియన్ స్టాక్స్ పడిపోయాయి, బంగారం రికార్డు స్థాయికి చేరింది. ట్రెజరీ యీల్డ్స్ తగ్గాయి. ఎగుమతులపై ఆధారపడి ఉన్న యూరప్, ఆసియాలోని మార్కెట్ రంగాల్లో మరింత ఒత్తిడి కనిపిస్తోంది” అని deVere Group CEO నైజెల్ తెలిపారు.