రిలీఫ్ : బంగారం ధర తగ్గింది

కొన్ని రోజులుగా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం ప్రియులకు కొంత ఊరట లభించింది. శుక్రవారం(సెప్టెంబర్ 6,2019) 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.372 తగ్గి రూ.39,278కి చేరుకుంది. నగల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం, రూపాయి బలపడడం వంటి కారణాలతో పసిడి ధర తగ్గినట్టు బులియన్ వర్గాలు తెలిపాయి. వెండి ధర కూడా కిలోకు రూ.1,273 తగ్గి రూ.49,187కి చేరుకుంది.
డాలర్ తో పోలిస్తే రూపాయి బలపడడం, ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ బలహీనంగా ఉండడమే బంగారం ధర తగ్గుదలకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ తెలిపింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు పుంజుకుందని ఆ సంస్థ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్ వివరించారు. ఇక, అంతర్జాతీయంగా తీసుకుంటే న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,510 డాలర్లకు పడిపోయింది. వెండి ధర ఔన్స్‌కు 18.30 డాలర్లకు తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం(సెప్టెంబర్ 6,2019) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.39,650 దగ్గర ముగియగా, వెండి ధర కిలోకు రూ.50,460 దగ్గర ముగిసింది.