UPI Services Down : మళ్లీ డౌన్.. యూపీఐ సేవల్లో అంతరాయం, తీవ్ర ఇబ్బందులు పడ్డ వినియోగదారులు.. 2రోజుల వ్యవధిలో రెండోసారి..
యూపీఐ యాప్స్ ఇలా సడెన్ గా డౌన్ కావడం రెండు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి.

UPI Services Down : గూగుల్ పే, ఇతర యూపీఐ సర్వీసులు డౌన్ అయ్యాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లావాదేవీలు ఆగిపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నారు. యూపీఐ యాప్స్ అన్నీ డౌన్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఈ సేవల్లో సాంకేతిక లోపం తలెత్తింది. రాత్రి 7 గంటల 30 నిమిషాల నుంచి పని చేయడం లేదని వినియోగదారులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (UPI) సేవల్లో అంతరాయం ఏర్పడటంతో పేమెంట్స్, ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి విషయాల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు వాపోయారు. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం.. బుధవారం రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ఈ సమస్య ఉత్పన్నమైనట్లు సమాచారం. ఈ మేరకు యూజర్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. యూపీఐ సేవలు అందించే గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేశారు.
Also Read : మీరు అనుకోండి సామీ.. ఈ SIP ఫార్ములాతో కోటీశ్వరుడు అవ్వొచ్చు.. కేవలం రూ.20వేల పెట్టుబడితో కోట్లలో సంపాదన!
యూపీఐ యాప్స్ ఇలా సడెన్ గా డౌన్ కావడం రెండు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గూగుల్ పే, ఫోన్ పే, బీమ్ సహా యూపీఐ యాప్స్ డౌన్ అయ్యాయి. మంగళవారం కూడా వినియోగదారులు ఇలాంటి ఇబ్బందే ఫేస్ చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాప్స్ మొరాయించడంతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అది మరువక ముందే ఇప్పుడు ఇతర యూపీఐ యాప్ లు డౌన్ కావడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
యూపీఐ యాప్స్ డౌన్ కావడం పై ఎన్ పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) స్పందించింది. ”ఇవాళ ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా, కొన్ని బ్యాంకులు అడపాదడపా లావాదేవీల క్షీణతను ఎదుర్కొంటున్నాయి. UPI వ్యవస్థ బాగానే పనిచేస్తోంది. అవసరమైన పరిష్కారం కోసం మేము సంబంధిత బ్యాంకులతో కలిసి పనిచేస్తున్నాము” అని UPIని నిర్వహించే NPCI ఎక్స్ లో తెలిపింది.