ఇండియన్ కిచెన్లో అమెరికా గ్యాస్.. భారత్, యూఎస్ కీలక ఒప్పందంతో ..
భారత ప్రజలకు, ప్రధానంగా ఉజ్వల యోజన లబ్ధిదారులకు సరసమైన ధరల్లో వంటగ్యాస్ అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి చెప్పారు.
LPG Import Deal: అమెరికా నుంచి వంటగ్యాస్ దిగుమతి చేసుకునేందుకు భారత్ ఒప్పందం చేసుకుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఎల్పీజీ దిగుమతుల్లో ప్రతి ఏడాది 10 శాతం అమెరికా నుంచి భారత్ చేసుకుంటుందని చెప్పారు.
ఇది ఒక చరిత్రాత్మక ఒప్పందమని హర్దీప్ సింగ్ పురి అన్నారు. దేశ ప్రజలకు సరసమైన ధరకే ఎల్‌పీజీని అందించడంలో ఇది ముందడుగని చెప్పారు. ఏడాది పాటు ఎల్‌పీజీని దిగుమతి చేసుకునేందుకు అమెరికాతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. (LPG Import Deal)
మొత్తం కలిపి 2.2 ఎంటీపీఏ ఎల్‌పీజీని దిగుమతి చేసుకోబోతున్నట్లు హర్దీప్ సింగ్ పురి చెప్పారరు. దేశం దిగుమతి చేసుకున్న వార్షిక దిగుమతుల్లో ఇది 10 శాతానికి సమానమన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో పాటు భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలు కొన్ని నెలల నుంచి అమెరికా కంపెనీలతో చర్చలు జరిపాయని చెప్పారు.
వంటగ్యాస్ మార్కెట్లలో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశం ఒకటిగా ఉందని హర్దీప్ సింగ్ పురి తెలిపారు. భారత ప్రజలకు, ప్రధానంగా ఉజ్వల యోజన లబ్ధిదారులకు సరసమైన ధరల్లో వంటగ్యాస్ అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
