Gold: బంగారం మరో నాలుగు నెలల తర్వాత అక్కడ తగ్గుతుందా? 50 ఏళ్ల నుంచి ట్రెండ్ ఇలాగే ఉంది మరి..
ఆ సమయం వరకు ఆగి గోల్డ్ కొనుగోలు చేస్తారు.

బంగారం కొనడానికి మంచి సమయం ఏది? అసలు పసిడి కొనడానికి మంచి సమయం అంటూ ఉంటుందా? ఎప్పుడు ధరలు తగ్గితే అప్పుడేగా కొనాల్సింది అని అనుకుంటాం. అయితే, అమెరికాలో మాత్రం బంగారం కొనడానికి మంచి సమయం ఏది అంటే జనవరి లేదా జులై అని నిపుణులు చెబుతారు. ఆ సమయం వరకు ఆగి గోల్డ్ కొనుగోలు చేస్తారు.
జనవరిలో, జులైలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 ఏళ్లుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. 2024 జులైలోనూ ఇదే జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
2024 జులైలోనూ పసిడి ధరల తగ్గుదలకు కారణాలు
డాలర్ విలువ పెరగడం: అమెరికా డాలర్ బలంగా ఉన్నప్పుడు ప్రజలు బంగారానికి బదులుగా డాలర్లనే తమ వద్ద ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే బంగారంపై వడ్డీ రాదు.
అమెరికా ద్రవ్యోల్బణం: అమెరికా ద్రవ్యోల్బణ డేటాపై ఆందోళనలు బంగారం డిమాండ్‌ను తగ్గించాయి
రెేట్ కట్స్‌లపై అంచనాలు తగ్గడం: తక్కువ వడ్డీ రేట్ల అంచనాలు ఉండడంతో బంగారంపై ప్రజలు వ్యయాన్ని తగ్గిస్తారు
లాభాల స్వీకరణ: బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరిన తర్వాత పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించారు
అమెరికా ట్రెజరీ ఈల్డ్స్: 4.40% కంటే ఎక్కువ ఈల్డ్స్ పెట్టుబడిదారుల నుంచి బంగారం కొనుగోళ్లు లేకుండా చేశాయి
Also Read: ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసా ఏంటి? దీని వల్ల అక్కడున్న ఇండియన్స్ కి వచ్చే నష్టం ఏంటి?
ప్రస్తుతం అంతర్జాతీయంగా ధరలు ఎలా ఉన్నాయి?
అంతర్జాతీయంగా నిన్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడం వల్ల తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, వాణిజ్య ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం వంటి సురక్షిత ఆస్తులపై డిమాండ్ కొనసాగుతోంది.
సోమవారం బంగారం ధర ఔన్స్‌కు 2,956.15 డాలర్ల గరిష్ఠ స్థాయిని చేరుకుంటే, మంగళవారం మాత్రం స్పాట్ గోల్డ్ 0.6% తగ్గి 2,934.99 డాలర్లకు చేరుకుంది. అదే విధంగా, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5% తగ్గి 2,948.60 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. 2024 నుంచి ఇప్పటివరకు బంగారం 11 సార్లు ఆల్‌టైం గరిష్ఠస్థాయిని నమోదు చేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా, మెక్సికో దిగుమతులపై సుంకాలు విధించాలన్న తన నిర్ణయాన్ని మళ్లీ చెప్పడంతో కొత్త టారిఫ్‌లు వాణిజ్య పోరును మరింత ముదిర్చే అవకాశముంది. “టారిఫ్‌లపై ఇంకా అనిశ్చితి ఉంది. అందువల్ల బంగారం ధరల్లో తగ్గుదల వచ్చినప్పటికీ పెట్టుబడిదారులు దీన్ని కొనుగోలు అవకాశంగానే భావిస్తారు” అని జానర్ మెటల్స్‌కు చెందిన సీనియర్ స్ట్రాటజిస్ట్ పీటర్ గ్రాంట్ చెప్పారు.
ఫిబ్రవరి 18తో ముగిసిన వారంలో బంగారం స్పెక్యులేటర్లు 13,605 కాంట్రాక్టుల నికర స్థాయిని తగ్గించగా, ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్‌లో నిల్వలు 904.38 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. ఇది ఆగస్టు 2023 తరువాత అత్యధిక స్థాయికి చేరుకుంది. బంగారం మార్కెట్‌లో దీర్ఘకాలిక స్థిరత్వానికి ఇది సంకేతమిస్తోంది. అమెరికా మార్కెట్ల దృష్టి ఇప్పుడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ పై ఉంది. ఫెడరల్ పాలసీలు వడ్డీ రేట్లపై ఎలా ప్రభావితం చేస్తాయన్నదే బంగారం ధరలకు కీలకాంశం.