ఉల్లి బంగారమాయె: కి.లో రూ.200

బంగ్లాదేశ్ లో ఉల్లి ధరలు వణికిస్తున్నాయి. మన దేశం నుంచి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్ లో ఉల్లిపాయల ధరలు మోత మోగుతున్నాయి. కేజీ ఉల్లి ఏకంగా రూ. 220 అమ్ముతున్నారు. ఉల్లిపాయలు కొనాలంటే సామాన్యులు వణికిపోతున్నారు. ఉల్లి ధరలపై పలుచోట్ల వినియోగదారులు ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ధరలు తగ్గించడానికి చర్యలు చేపట్టింది. విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్, చైనా వంటి దేశాల నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటోంది.
ఇక మనదేశంలో కూడా ఉల్లిపాయల ధరలు మండిపోతున్నాయి. కి.లో రూ. 70 వరకు అమ్ముతున్నారు. నెల రోజులుగా ధరలు ఎక్కువగా ఉన్నా పాలకులు పట్టించుకున్నట్టు కనబడటం లేదు. ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉల్లి ధర రూ .50 నుంచి రూ .70 మధ్య ఉంటుంది.
వర్షాల కారణంగా పంటలు దెబ్బతినడంతో ఉల్లిపాయలు ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మరో రెండు నెలల పాటు ఇవే ధరలు కొనసాగే అవకాశముందని వెల్లడించారు. ఇక ఈ రోజు నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉల్లి ధరల గురించి ప్రతిపక్షాలు ప్రస్తావించనున్నాయి.