PNB Interest Rates : పంజాబ్ బ్యాంకు కస్టమర్లకు పండగే.. హోం లోన్, కార్ల లోన్లపై వడ్డీ రేట్లు తగ్గింపు.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
PNB Interest Rates : నేషనల్ బ్యాంక్ (PNB) వివిధ రకాల రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుంచే అమల్లోకి వస్తాయని పీఎన్‌బీ తెలిపింది.

PNB Interest Rates
PNB Interest Rates : ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ రుణాలలో గృహ, ఆటో రుణాలు ఉన్నాయి. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత పిఎన్‌బి ఈ నిర్ణయం తీసుకుంది.
గృహ, కారు, విద్య, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లలో మార్పులు :
“వడ్డీ రేట్లకు సబ్సిడీ ఇచ్చిన వాటిలో గృహ రుణాలు, కారు రుణాలు, విద్య, వ్యక్తిగత రుణాలు ఉన్నాయి. తద్వారా వినియోగదారులు వివిధ రకాల ఫైనాన్సింగ్ ఆప్షన్లను పొందవచ్చు. 5 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల ఫిబ్రవరి 7న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించింది” అని పీఎన్‌బీ ఒక ప్రకటనలో తెలిపింది.
గృహ రుణ రేటు 8.15 శాతానికి తగ్గింపు :
వడ్డీ రేటు తగ్గింపు తర్వాత పీఎన్‌బీ వివిధ పథకాల కింద గృహ రుణ రేట్లను 8.15 శాతానికి సవరించింది. మార్చి 31, 2025 వరకు కస్టమర్లు ముందస్తు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీల పూర్తి మినహాయింపును పొందవచ్చని బ్యాంక్ తెలిపింది. సాంప్రదాయ గృహ రుణ పథకంలో వడ్డీ రేటు సంవత్సరానికి 8.15 శాతం నుంచి ప్రారంభమవుతుందని. నెలవారీ ఈఎంఐ లక్ష రూపాయలకు రూ.744గా పేర్కొంది.
పీఎన్‌బీ డీజీ హోమ్ లోన్ సౌకర్యంతో రుణగ్రహీతలు ఎలాంటి ముందస్తు చెల్లింపు జరిమానాలు లేకుండా, ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేకుండా రూ. 5 కోట్ల వరకు రుణాలు పొందవచ్చు. పీఎన్‌బీ జనరేషన్ నెక్స్ట్ గృహ రుణ పథకం దరఖాస్తుదారుడి అర్హతకు గరిష్టంగా 1.25 రెట్లు రుణాలు పొందవచ్చు. తిరిగి చెల్లించే వ్యవధి 30 ఏళ్ల వరకు ఉంటుంది.
ఆటో లోన్ వడ్డీ రేటు 8.50శాతం నుంచి ప్రారంభం :
ఆటో లోన్ల విషయానికొస్తే.. కొత్త, వాడిన కార్ల ఫైనాన్సింగ్ కోసం వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.50 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఈఎంఐలు కూడా లక్షకు రూ. 1,240 వరకు ఉంటాయి. పీఎన్‌బీ సంవత్సరానికి 8.50 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేటులో 0.05 శాతం రాయితీని, రూ. లక్షకు రూ. 1,240 ప్రారంభ ఈఎంఐని అందిస్తోంది. కస్టమర్లు 120 నెలల వరకు ఎక్కువ తిరిగి చెల్లించే కాలపరిమితిని కూడా పొందవచ్చు. ఎక్స్-షోరూమ్ ధరకు 100 శాతం ఫైనాన్సింగ్‌ను అందిస్తుంది.
విద్యా రుణాలపై 7.85 వడ్డీ తగ్గింపు :
ఎడ్యుకేషన్ లోన్ విషయంలో కనీస కార్డు రేటును సంవత్సరానికి 7.85 శాతానికి తగ్గించింది. పీఎన్‌బీ సరస్వతి, పీఎన్‌బీ ఉడాన్ పథకాలతో భారత్, విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తూ, 9శాతం వడ్డీకి, ప్రాసెసింగ్ ఛార్జీ లేకుండా రుణాలను అందిస్తున్నాయి.
డిజిటల్ ప్రక్రియతో రూ. 20 లక్షల వరకు పర్సనల్ లోన్లు :
కస్టమర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ ప్రక్రియ ద్వారా రూ. 20 లక్షల వరకు పర్సనల్ లోన్లను పొందవచ్చు. ఇకపై కస్టమర్లు సంబంధిత బ్రాంచ్ కు వెళ్లాల్సిన పనిలేదు. ఎలాంటి పేపర్ వర్క్ అక్కర్లేదు. ఈ కొత్తగా సవరించిన రేట్లు 11.25 శాతం నుంచి ప్రారంభమవుతాయి.
ఫిబ్రవరి 10నుంచే కొత్త వడ్డీలు అమల్లోకి :
కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి వస్తాయని పీఎన్‌బీ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆర్బీఐ పాలసీ రేటు తగ్గింపుకు అనుగుణంగా గృహ రుణాలు సహా రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన సంగతి తెలిసిందే.
పీఎన్‌బీ వడ్డీ రేట్లు, రిటైల్ లోన్లపై పూర్తి వివరాల కోసం :
రుణ దరఖాస్తుదారులు ఈ పథకాలకు సంబంధించిన మార్పులు, కొత్త వివరాలను వారి స్థానిక పీఎన్‌బీ ఆఫీసులో లేదా బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా పొందవచ్చు. ఏవైనా ఇతర ప్రశ్నల కోసం మీరు బ్యాంక్ కస్టమర్ సపోర్ట్ టీమ్ సంప్రదించాలి.