పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో భారీ మోసం.. వేల కోట్లు ఎగ్గొట్టిన సింటెక్స్ కంపెనీ!

  • Published By: vamsi ,Published On : October 1, 2020 / 05:47 PM IST
పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో భారీ మోసం.. వేల కోట్లు ఎగ్గొట్టిన సింటెక్స్ కంపెనీ!

Updated On : October 1, 2020 / 6:14 PM IST

Borrowing Fraud in Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)కు అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వేల కోట్లు ఎగ్గొట్టినట్లుగా బ్యాంకు ప్రకటించింది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు రూ.వేల కోట్లు ఈ బ్యాంకుకు ఎగ్గొట్టిన తర్వాత లేటెస్ట్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఈ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఎస్ఐఎల్) తీసుకున్న రూ.1,203.26 కోట్ల రుణాలను ఫ్రాడ్‌గా ప్రకటించింది పంజాబ్ నేషనల్ బ్యాంకు.

సింటెక్స్ ఇండస్ట్రీస్ మోసపూరితంగా రూ.1,203 కోట్ల రుణాన్ని పొందినట్లుగా పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రకటించింది. సెబి నమోదిత నిబంధనలు, వెల్లడి అంశాలు, బ్యాంకు విధానాల ప్రకారం సింటెక్స్ ఇండస్ట్రీస్ నికర నిర్థక ఆస్తుల్లో రూ.1203 కోట్ల మేర మోసంతో రుణాలు తీసుకున్నట్లుగా బ్యాంకు వెల్లడించింది. లోన్ రీ-షెడ్యూల్ చెయ్యడానికి ఇప్పటికే గత ఏడాది డిసెంబర్‌లో బ్యాంకు తిరస్కరించగా.. రూ.1,203 కోట్ల మోసం గురించి ఆర్బీఐకి అకౌంట్స్ ఆఫ్ ది కంపెనీలో వివరించిందని, నిబంధనల ప్రకారం బ్యాంకు ఇప్పటికే రూ.215.21 కోట్లను కేటాయించిందని తెలిపింది.



అహ్మదాబాద్ జోనల్ కార్యాలయంలోని కార్పోరేట్ శాఖలో ఈ మోసం జరిగినట్లు బ్యాంకు ప్రకటించింది. ఒక అకౌంట్‌ను మోసపూరితంగా ప్రకటిస్తే బ్యాంకింగ్ రెగ్యులేటర్ నిబంధనల ప్రకారం బ్యాంకులు 100 శాతం బకాయి రుణాలను ఒకేసారి లేదా 4 త్రైమాసికాల్లో కేటాయించాలి. సింటెక్స్ ఇండస్ట్రీస్‌కు రుణాలు ఇచ్చిన ఇతర బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. సింటెక్స్ మొత్తం రుణాలు మార్చి 31, 2020 నాటికి రూ.7,157.9 కోట్లు.



వస్త్రాలు మరియు నూలులను తయారుచేసే సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ప్లాస్టిక్ వాటర్ ట్యాంకులను తయారుచేసే సింటెక్స్ గ్రూపుకు చెందినది. సింటాక్స్ భారతదేశంలో గృహోపకరణాల తయారీదారుగా ప్రసిద్ది చెందిన సంస్థ. సింటెక్స్ గ్రూప్ సింటెక్స్ ప్లాస్టిక్ టెక్నాలజీ లిమిటెడ్ యాజమాన్యంతో కలిసి ఉంది. ఇది సింటెక్స్ ఇండస్ట్రీస్ నుంచి 2017లో విడిపోయింది.