RBI Repo Rate: ఈఎంఐ చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్.. మరోసారి రేపో రేటు తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం..
ఈఎంఐ చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.

RBI Governor Sanjay Malhotra
RBI Repo Rate: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గుడ్ న్యూస్ చెప్పింది. కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన ఏప్రిల్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగింది. ప్రపంచ, దేశీయ వృద్ధి మందగించడం, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 26శాతం ప్రతీకార సుంకాలను ప్రకటించిన కొద్దిరోజులకే ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ఐదు సంవత్సరాల తరువాత ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆర్బీఐ రెపోరేటును తగ్గించిన విషయం తెలిసిందే. 25 బేసిన్ పాయింట్లు కోత విధించింది. ఆ సమయంలో రెపోరేట్ 6.25శాతానికి చేరింది. ప్రస్తుతం ఆర్బీఐ రెపోరేటును 25బేసిన్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటంతో రెపో రేటును 6.25శాతం నుంచి 6 శాతానికి దిగొచ్చింది.
రెపో రేటు అనేది నేరుగా బ్యాంకు రుణాలు తీసుకునే కస్టమర్లకు అనుసంధానించి ఉంటుంది. రెపో రేటు తగ్గుదల కారణంగా లోన్ ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. రెపోరేటు తగ్గిన కారణంగా హోం లోన్స్, పర్సనల్ లోన్స్, కారు లోన్స్ కు చెల్లింస్తున్న ఈఎంఐ తగ్గుతుంది.