వదంతులు నమ్మొద్దు: ఎల్ఐసీ గురించి వస్తున్న వార్తలు ఫేక్

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పై ఆ సంస్థ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అన్నీ అవాస్తవం అని వెల్లడించింది కంపెనీ. వదంతులను నమ్మొద్దని ప్రకటించిన ఎల్ఐసీ.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎల్ఐసీపై తప్పుడు సమాచారం ఇస్తూ.. వదంతులు సృష్టిస్తున్నారని అన్నారు.
పాలసీ కట్టిన వాళ్లను ఆందోళనకు గురిచేసి, కొత్తగా కట్టాలని అనుకునేవాళ్లను భయపెట్టడానికే ఇటువంటి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారని, ఇవన్నీ పాలసీదార్లను తప్పుదోవ పట్టించే విధంగా ఉండటంతోపాటు ఎల్ఐసీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని కంపెనీ చెప్పుకొచ్చింది.
కొంతమంది పనిగట్టుకొని వీటిని ప్రచారం చేస్తున్నారని, వదంతుల ఆధారంగా పాలసీదారులు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని కోరింది ఎల్ఐసీ. 2018-19 ఆర్థిక సంవత్సరంలో పాలసీదారులకు మొత్తం రూ.50వేల కోట్ల బోనస్ లను ప్రకటించామని చెప్పింది ఎల్ఐసీ. ఆగస్టు 2019 నాటికి మొత్తం పాలసీల్లో ఎల్ఐసీ వాటా 72.84 శాతం కాగా, మొదటి ప్రీమియం వసూళ్లలో 73.06 శాతం వాటా సాధించినట్లు కంపెనీ చెప్పింది.