HMDA Development Plan : టీ సర్కార్ డెవలప్‌మెంట్ ప్లాన్.. హెచ్ఎండీఏపై స్పెషల్ ఫోకస్
HMDA Development Plan : హైదరాబాద్ పరిధిలో భారీగా నిర్మాణ యాక్టివిటీ పెరుగుతుండడంతో... అనుమతులు ఆలస్యం కాకుండా మరిన్ని సౌకర్యాలు కల్పించేలా అడుగులు వేస్తోంది.

Telangana Govt Development Plan
HMDA Development Plan : స్తిరాస్థి రంగ అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా HMDA కొత్త ప్రణాళికలకు శ్రీకారం చుడుతోంది. హైదరాబాద్ పరిధిలో భారీగా నిర్మాణ యాక్టివిటీ పెరుగుతుండడంతో… అనుమతులు ఆలస్యం కాకుండా మరిన్ని సౌకర్యాలు కల్పించేలా అడుగులు వేస్తోంది. నిర్మాణ రంగానికి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం ఉన్న జోన్లను డబుల్ చేసే యోచనలో ఉంది కొత్త సర్కార్.
హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరిస్తోంది. వచ్చే 5 నుంచి 10 ఏళ్లలో స్థిరాస్తి రంగం మరింత ఊపందుకోనుంది. కొత్త కొత్త పరిశ్రమలు మహానగరం దారి పడుతుండడంతో…శివారు ప్రాంతాల్లోనూ అభివృద్ధి మరింత విస్తరించనుంది. ఈ క్రమంలో మౌలిక వసతుల కల్పన పెద్దఎత్తున జరగాల్సి ఉండడంతో… HMDA అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రస్తుతం ఏడు జిల్లాల్లో 7వేల 228 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ :
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని కొంత భాగం, భువనగిరి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి. 849 గ్రామాలు ఈ హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ పరిధి కింద ఉన్నాయి. ప్రధాన కార్యాలయంతోపాటు శంషాబాద్, మేడ్చల్, శంకర్‌పల్లి, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో జోనల్ కార్యాలయాలున్నాయి. హైదరాబాద్‌తోపాటు HMDA పరిధిలోని పట్టణాలు మున్సిపాలిటీ కార్పోరేషన్ల పరిధిలో నిర్మాణ రంగం రోజురోజుకు పెరుగుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులపై కూడా HMDA ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుంది.
నాలుగు జోన్ల నుంచి భారీగా దరఖాస్తులు :
స్థిరాస్తి రంగం పరుగులు పెట్టాలంటే ప్రభుత్వ పరంగా అనుమతుల ప్రక్రియ వేగవంతం కావాలి. ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్ల నుంచి భారీగా దరఖాస్తులు వస్తుండటంతో సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం నాలుగు జోన్లకు 20 నుంచి 25 మంది వరకు పీవోలు, ఏపీవోలు ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. దీంతో దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతోంది. కొన్నిసార్లు లేఅవుట్లు, భవనాల అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని దరఖాస్తుదారుల చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉన్న జోన్ల సంఖ్యను రెట్టింపు చేసి అదనపు సిబ్బందిని నియమించడం ద్వారా… నిర్ణీత గడువులోనే లేఅవుట్లు, భవన నిర్మాణాల అనుమతులు ఇవ్వడం ద్వారా స్థిరాస్తి రంగానికి ఊపు తేవాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
హెచ్ఎండీఏ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం :
కొవిడ్ తర్వాత HMDA పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. వేలాది లేఅవుట్లు, లక్షల సంఖ్యలో నిర్మాణాలు వస్తున్నాయి. ఇందులో పంచాయతీలు, కార్పొరేషన్లలో 1000 చదరపు మీటర్లు, ఐదు అంతస్తుల వరకు మాత్రమే అనుమతులిచ్చే అవకాశముంది. మిగిలిన అన్ని దరఖాస్తులను హెచ్ఎండీఏనే పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే అనేక బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇవ్వగా, పలు ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లలో పని చేసే సిబ్బంది తక్కువగా ఉండటంతో ఫైల్స్ క్లియరేన్స్ చాలా ఆలస్యం అవుతుంది.
8 జోన్లు లేదా 10 వరకు పెంచే ప్రణాళికలు :
ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లను 8 లేదా 10 వరకు పెంచడంతోపాటు సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో నియమిస్తే వేగంగా అనుమతులు లభిస్తాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులుఅభిప్రాయ పడుతున్నారు. కొత్త జోన్లు ఏర్పడితే జోనల్ స్థాయిలోనే ప్లానింగ్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేసి అప్పటికప్పడు అనుమతి ఇవ్వడానికి అవకాశముంటుందని రియల్ నిపుణులు అంటున్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన జోన్ల విస్తరణ కొత్త సర్కార్ హయాంలోనైనా అమల్లోకి వస్తుందనే ఆశాభావంతో అధికారులున్నారు.
Read Also : Hyderabad Real Estate : రియల్ ఇన్‌కమ్.. టీ-సర్కార్‌కు కాసుల పంట.. భారీగా ఆదాయం ఇక్కడి నుంచే..!