బడ్జెట్ 2019 : టీవీలు, కార్లు, బైక్స్ ధరలు పెరుగుతాయా!

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 06:46 AM IST
బడ్జెట్ 2019 : టీవీలు, కార్లు, బైక్స్ ధరలు పెరుగుతాయా!

Updated On : January 30, 2019 / 6:46 AM IST

కేంద్ర బడ్జెట్ తయారీ తుదిరూపుకి వచ్చింది. ఎన్నికల వేళ కావటంతో భారీ తాయిళాలు ఉంటాయని కొందరు.. కాదని మరికొందరు అంటున్నారు. ఆర్థిక నిపుణుల అంచనాలు ఎలా ఉన్నా.. సామాన్యుడికి మిగిలేది ఏంటీ.. పోయేది ఏంటీ అనే ఆసక్తిగా మారింది. అందులో భాగంగా కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

టీవీలు, ఏసీలు, ఫ్రిజ్ ధరలు పెరగనున్నాయి :
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకం పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రభావం టీవీ, ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్స్ పై పడనుంది. దేశంలో ప్రతి ఏటా 50 లక్షల టీవీలు అమ్మకాలు జరుగుతుంటే.. అందులో 49 లక్షల టీవీలు దిగుమతి చేసుకునేవే. ప్రస్తుతం పెంచిన దిగుమతి సుంకంతో ఈ ధరలు పెరగనున్నాయి. ఈ దిగుమతి పన్నును తగ్గించాలని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయినెన్స్ మ్యానిఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) డిమాండ్ చేస్తోంది. గత ఏడాది 19 ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై దిగుమతి పన్ను 20శాతానికి చేరిందన్నారు. ఈ బడ్జెట్ లో పన్ను మినహాయింపులు ఇవ్వకపోతే.. ఆ భారం అంతా వినియోగదారులపై వేస్తాం అంటున్నాయి కంపెనీలు. బడ్జెట్ లో పన్ను తగ్గకపోతే ఏసీలు, ఫ్రిజ్ లు, టీవీల ధరలు భారీగానే పెరగనున్నాయి.

 

కార్లు, బైక్స్ ధరలకూ రెక్కలు :
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు, బైక్స్, వాణిజ్య వాహనాలపై దిగుమతి సుంకం 25 నుంచి 40శాతంగా ఉంది. ఈ తరహా వాహనాలపై పన్నును 15 నుంచి 30శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తోంది ఆటో ఇండస్ట్రీ. ముఖ్యంగా విదేశీ కార్లు, బైక్స్ అమ్మకాలు పెరగాలి అంటే 50 నుంచి 100శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని సగానికి సగం తగ్గించాల్సిన అవసరం ఉందని కోరుతుంది. కేంద్రం పెంచిన ఈ పన్నును వ్యాపారులే భరిస్తున్నారని.. ఇదే విధంగా 2019లోనూ కొనసాగితే అమ్మకాలు కష్టంగా మారే ప్రమాదం ఉందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కస్టమ్స్ డ్యూటీని ఇక నుంచి వినియోగదారులకే బదలాయిస్తాం అంటున్నారు. బడ్జెట్ 2019లో కస్టమ్స్ డ్యూటీ మినహాయింపులు రాకపోతే.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులతో తయారయ్యే కార్లు, బైక్స్ ధరలు పెరగనున్నాయి.