Union Budget 2026 : బడ్జెట్ 2026పై గంపెడు ఆశలు : ఈసారి కూడా మధ్యతరగతివారి ఆశలు ఫలిస్తాయా? భారీ డిమాండ్లు ఇవే..!
Union Budget 2026 : బడ్జెట్ 2026పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈసారి కూడా ఆదాయపు పన్ను ఉపశమనం లభిస్తుందా? ఆర్థిక మంత్రి మధ్యతరగతిని ఆశ్చర్యపరుస్తారా? అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Income tax relief expectations (Image Credit To Original Source)
- ఫిబ్రవరి 1నే కేంద్ర వార్షిక బడ్జెట్ 2026
- బడ్జెట్ పై భారీగా ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ప్రజలు
- 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
- 88వ బడ్జెట్ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందా?
- ఈసారి కూడా ఆదాయపు పన్ను ఉపశమనం లభిస్తుందా?
Union Budget 2026 : వచ్చే ఆర్థిక సంవత్సరం 2027కి కౌంట్‌డౌన్ మొదలైంది. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి కేంద్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కూడా మధ్యతరగతి కుటుంబాలు రాబోయే బడ్జెట్ నుంచి భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నాయి. ప్రధానంగా ఆదాయపు పన్నుపై ఉపశమనాలు ఉండవచ్చునని భావిస్తున్నారు.
88వ బడ్జెట్‌లో అన్ని వర్గాల వారికి అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, దేశ ప్రజల డిమాండ్ కోసం ప్రభుత్వం గత ఏడాదిలో పన్ను ఉపశమనం, జీఎస్టీ సంస్కరణలను పొడిగిస్తుందని ఆర్థికవేత్తలు, పరిశ్రమ సంస్థలు విశ్వసిస్తున్నాయి.
మధ్యతరగతికి ఏ పన్ను ఉపశమనం ఉండొచ్చు :
గత బడ్జెట్‌లో రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు అందించింది. దాంతో రూ. 12.75 లక్షల వరకు ఆదాయం పొందే జీతం, పన్ను చెల్లింపుదారులకు భారీగా ఉపశమనం లభించింది. అంతేకాదు.. పన్ను స్లాబ్‌లలో కూడా ముఖ్యమైన మార్పులు చేసింది. టీడీఎస్, టీసీఎస్ సంబంధించిన నియమాలను సడలించారు. ఈసారి బడ్జెట్‌లో కూడా అలాంటి అంచనాలు ఉన్నాయి.
ఈ బడ్జెట్‌లో పన్ను వ్యవస్థలో స్థిరత్వం, వ్యాజ్యాలను తగ్గించడం, ప్రైవేట్ పెట్టుబడులకు ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. బడ్జెట్‌లో మరిన్ని ప్రోత్సాహకాలు, సమ్మతి సంస్కరణలకు ప్రాధాన్యత ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించడం కన్నా కొత్త పన్ను విధానం నిర్మాణాన్ని మెరుగుపరచడంపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది.
ఉద్యోగాలపై దృష్టి కొనసాగింపు :
2025 ఆర్థిక సంవత్సరంలో మందగమనం తర్వాత సెప్టెంబర్‌లో జీఎస్టీ సంస్కరణలు, మెరుగైన రుతుపవనాలతో గ్రామాల్లో డిసెంబర్ 2025 త్రైమాసికంలో వాహన అమ్మకాలు భారీగా పెరిగాయని రేటింగ్ ఏజెన్సీ ICRA తెలిపింది.
ఈ ఏడాదిలో కూడా బడ్జెట్ మౌలిక సదుపాయాల వ్యయం, గ్రామీణ ఉత్పత్తి, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంపై దృష్టి పెట్టవచ్చనని అంటున్నారు. మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్న పన్ను మినహాయింపు పరిమితిని కూడా సవరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గత ఏడాదిలో మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం లభించినా ఆదాయ స్థాయిలలో న్యాయమైన రీతిలో పన్నులను వర్తింపుచేయడం సాధ్యపడలేదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ పన్ను స్లాబ్‌లు లేకపోవడం వల్ల పన్నులను వర్తింపజేయడం కష్టమైంది.
ఫలితంగా, చాలా కుటుంబాలు ఆదాయ వ్యత్యాసాలతో సంబంధం లేకుండా ఒకే స్థాయి ఉపశమనం పొందాయని అంటున్నారు. దీని కారణంగా, 2026 బడ్జెట్ నుంచి అంచనాలు భిన్నంగా ఉన్నాయని చెబుతున్నారు.
కొత్త పన్ను శ్లాబ్ ఒక్కటే పరిష్కారం :
ఈ సమస్యకు కొత్త పన్ను శ్లాబ్‌ను ప్రవేశపెట్టడం ఒక్కటే పరిష్కరమని అంటున్నారు. రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య నికర ఆదాయంపై 25శాతం పన్ను విధించే కొత్త పన్ను పరిధిని కలిపితే ఈ అసమతుల్యత తొలగిపోతుందని అంటున్నారు.
ఈ కొత్త శ్లాబ్ మధ్య నుంచి ఉన్నత ఆదాయం పొందేవారికి భారీగా ఉపశమనం ఉంటుంది. అదే సమయంలో అత్యధిక ఆదాయ వర్గాలకు 30శాతం పన్ను రేటును రిజర్వ్ చేస్తుందని టాక్స్ అండ్ ట్రాన్సిషన్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ నారాయణ్ అన్నారు.
సమస్యల పరిష్కారమే ముఖ్యం :
బడ్జెట్ 2026లో పన్ను మినహాయింపులు, సేవింగ్స్ బెనిఫిట్స్ మెరుగుపరచడంపై కూడా దృష్టి పెట్టవచ్చని ఆయన అన్నారు. పన్ను మినహాయింపులపై పరిమితుల కారణంగా పన్ను పొదుపులు, పెట్టుబడులు, పదవీ విరమణ ప్రణాళికను ప్రోత్సహిస్తుందని కూడా భావిస్తున్నారని అన్నారు. స్థిర డిపాజిట్లు వంటి సేవింగ్స్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే, పన్ను చెల్లింపుదారులపై సమ్మతి ఒత్తిడిని తగ్గించేందుకు టీడీఎస్, టీసీఎస్ వ్యవస్థను సరళీకృతం చేయాలని కోరుతున్నారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పన్ను శ్లాబులు, డిడక్షన్ పరిమితులను క్రమం తప్పకుండా అప్ డేట్ చేయాలని మరో డిమాండ్ వినిపిస్తోంది. 2026 బడ్జెట్ పన్ను రేటు మార్పులపై మాత్రమే దృష్టి పెట్టకుండా ఈ సమస్యలను పరిష్కరిస్తే ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు నిజంగా మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
