YES బ్యాంక్ లో చిక్కుకున్న APSRTC రూ. 240 కోట్లు

దేశంలోని అతి పెద్ద ప్రయివేటు బ్యాంకుల్లో ఒకటైన YES BANK సంక్షోభానికి APS RTC బలైంది. ఆర్టీసికి చెందిన రూ. 240 కోట్ల రూపాయలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. దీంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు. రోజువారి చెల్లింపుల్లో భాగంగా బ్యాంకుకు వెళ్లిన ఆర్టీసీ అధికారులకు బ్యాంకు షాకిచ్చింది.
రూ.50 వేలకు మించి తీసుకోటానికి వీలులేదని బ్యాంకు సిబ్బంది చెప్పటంతో అధికారులకు దిమ్మతిరిగింది. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. డీజిల్ కొనుగోలుకు డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలన్న ఆందోళన వారిలో మొదలైంది. గత కొద్ది రోజులుగా ఈ బ్యాంక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడలోని యస్ బ్యాంకు హెడ్ ఆఫీసులో అకౌంట్ ప్రారంభించి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తోంది. ఎప్పుడూ ఓడీలు వాడుకునే సంస్థకు జనవరి 2020 నుంచి సిబ్బంది జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుండటంతో అకౌంట్లో నిధులు నిల్వచేసుకునే అవకాశం లభించింది. జనవరి నెలకు సంబంధించిన జీతం ప్రభుత్వం ఆర్టీసీకి ఫిబ్రవరిలో చెల్లించింది. ఈ డబ్బుల్లో నుంచి రూ.120కోట్లు యస్ బ్యాంకులోని ఆర్టీసీ ఖాతాలో జమ అయింది.
దీంతోపాటు రోజువారీ వచ్చిన కలెక్షన్ల డబ్బులు రూ.80కోట్లు ఏ రోజుకు ఆరోజు బ్యాంకులో డిపాజిట్ చేశారు. సిబ్బంది జీతాల నుంచి రికవరీ చేసిన మరో 40కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇదే బ్యాంకులోని పీఎఫ్ ఖాతాకు బదిలీ చేశారు. దీంతో మార్చి మొదటి వారం ముగిసే నాటికి మొత్తం రూ.240కోట్లు యస్ బ్యాంకులో నిల్వఉంది.
ఈ పరిస్థితుల్లో బ్యాంకు ఆర్థిక ఇబ్బందుల్లో పడటం, ఖాతాదారులు ఏటీఎంలకు క్యూ కట్టడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. దీనిపై కలగజేసుకున్న కేంద్ర ప్రభుత్వం డిపాజిటర్లకు భరోసా ఇస్తూ నెల రోజుల పాటు లావాదేవీలు అతి తక్కువ గా జరపాలని యస్ బ్యాంకుపై నిబంధన విధించింది. ఫలితంగా ఆర్టీసీ లాంటి వందల కోట్ల రూపాయలు ఖాతాలో జమ చేసిన సంస్థలు రూ.50వేలకు మించి తీసుకోలేని దుస్థితి ఏర్పడింది. సోమవారం విజయవాడలోని ఆర్టీసీహౌ్‌సలో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఎక్కడచూసినా, విన్నా ఇదే చర్చ జరుగుతోంది.
జాతీయ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను వడ్డీకీ ఆశపడి ఇలాంటి బ్యాంకుల్లోకి మార్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు డిపాజిట్లకు తప్ప కరెంట్ అకౌంట్లకు వడ్డీ చెల్లించవు. యస్ బ్యాంకు అధికారులు ఆర్టీసీ అధికారులను సంప్రదించి కరెంట్ అకౌంట్ తమవద్ద ప్రారంభించాలని, రోజువారీ వడ్డీ చెల్లిస్తామని, అది కూడా 6.25శాతం ఇస్తామని ఆశ పెట్టడంతో వందల కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేశారు. ఇప్పుడు అసలుకే ముప్పు రావడంతో ఆర్టీసి అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నెల తర్వాతైనా మొత్తం డబ్బులు వస్తాయా..? అనే సందేహం వారిని వెంటాడుతోంది.
See Also | మారుతీరావు మృతికి ఆస్తి తగాదాలే కారణమా?