Yes Bank ఖాతాదారులకు గుడ్ న్యూస్

యెస్ బ్యాంకు(Yes Bank) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఆర్టీజీఎస్ (Real time gross settlements) సర్వీసులను ఎనేబుల్ చేశారు. ఖాతాదారులు తమ క్రెడిట్ కార్డు బకాయిలు, రుణాలు ఇతర బ్యాంకు ఖాతాల నుండి చెల్లింపులు చేయడానికి ఆర్టీజీఎస్ సేవలు ప్రారంభించినట్టు ఎస్ బ్యాంక్ బుధవారం(మార్చి 11,2020) తెలిపింది. IMPS, NEFT సేవలను అనుమతించిన ఒక రోజు తర్వాత ఆర్టీజీఎస్ సేవలను సైతం పునరుద్ధరించారు.
రూ .2 లక్షలకు పైగా చెల్లింపుల కోసం ఆర్టీజీఎస్ ను ఉపయోగిస్తారు. దీని కన్నా తక్కువ మొత్తం చెల్లింపులు నెఫ్ట్ ద్వారా చేయవచ్చు. బ్యాంకు లోన్లు, క్రెడిట్ కార్డు చెల్లింపులు IMPS ద్వారా చేయవచ్చు. ”RTGS సేవలు ప్రారంభించబడ్డాయి, మీరు YES BANK క్రెడిట్ కార్డ్ బకాయిలు, బ్యాంకు లోన్లు ఇతర బ్యాంకు ఖాతాల నుండి చెల్లించవచ్చు” అని బ్యాంక్ అధికారులు ట్వీట్‌లో తెలిపారు.
అదే సమయంలో వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ‘మారటోరియం-సంబంధిత FAQs’ లో, సంక్షోభానికి గురైన యెస్ బ్యాంక్ ఆన్‌లైన్ చెల్లింపులు, చెక్కులను క్లియర్ చేయడం, EMI చెల్లింపు వంటి సేవలు తాత్కాలిక నిషేధంలో కొనసాగుతాయని చెప్పారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. మార్చి 5న యెస్ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3 వరకు యెస్ బ్యాంకు ఖాతాదారులు వారి అకౌంట్ నుంచి కేవలం రూ.50 వేల నగదును మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.