పట్టపగలు యువతి కిడ్నాప్

పట్ట పగలు నడిరోడ్డుపై యువతిని కిడ్నాప్ చేశాడో యువకుడు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.
కర్ణాటక లోని కోలార్ పట్టణంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎంబీ రోడ్డులో ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళుతున్నారు. ఈలోపు వారికి ఎదురుగా ఒక ఇన్నోవా కారు వచ్చి ఆగింది. కారులోంచి దిగిన యువకుడు ఆ ఇద్దరు యువతులలో ఒక యువతిని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని వెళ్లి పోయాడు.
సోదరి కిడ్నాప్ ను అడ్డుకోటానికి పక్కనున్న యువతి ప్రయత్నించినా ఫలితంలేకపోయింది. ఆమె వెంటనే గల్ పేట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్దలం వద్దకు చేరుకుని పరిశీలించారు. అక్కడ షాపులు వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించారు.
కిడ్నాప్ చేసిన యువకుడిని కోలారు నగరంలోని దేవాంగపేటకు చెందిన శివు(23) గా గుర్తించారు. తమ ప్రేమను యువతి తల్లి తండ్రులు అంగీకరించలేదనే కోపంతోనే శివు కిడ్నాప్ కు యత్నించినట్లు తెలుసుకున్నారు. శివు ఆచూకి తెలుసుకున్న పోలీసులు, యువతిని తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.