Shadnagar Woman Murder Case : రక్తపు మడుగులో కన్నతల్లి శవం.. పాపం ఆ విషయం తెలియని పసికందు.. రాత్రంతా అక్కడే
Shadnagar Woman Murder Case :
married woman brutally killed under mysterious circumstances in shadnagar ranga reddy district
Shadnagar Woman Murder Case : కన్నతల్లిని ఎవరో చంపి పడేశారు. ఆ విషయం పాపం రెండున్నరేళ్ల పసిదానికి ఏం అర్థం అవుతుంది. తల్లికి ఏం జరిగిందో తెలియదు.. ఎందుకలా పడుకుని ఉందో అర్థం కాలేదు. ఒక్కటి మాత్రం ఆ చిట్టి మనసుకు తెలిసింది. అమ్మ తనను చూడటం లేదు.. తనతో మాట్లాడటం లేదు.. ఆడించడం లేదు.. నవ్వించడం లేదు. అందుకు కారణాలు ఆ పసి మనసుకు తెలియవు. ఆ చిన్నారికి తెలిసిందల్లా ఒక్కటే.. తాను ఏడిస్తే అమ్మ చూడలేదు.. పరుగున వచ్చి గుండెల్లో దాచుకుంటుంది. ఇప్పుడు కూడా అలానే చేస్తే అమ్మ లేస్తుందేమో అని ఆ చిన్ని మనసుకు తట్టిందేమో.. కన్న తల్లి శవం మీద పడుకుని రాత్రంతా కన్నీరు మున్నీరుగా విలపించిందా చిన్నారి. అయినా ఆ తల్లి లేవలేదు. ఉదయం పొలం పనులకు వెళ్తున్న వారికి పసి పాప ఏడుపు వినిపించడంతో.. వారు అక్కడకు వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ శవం కనిపించింది. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షాద్‌నగర్ మండలంలోని దేవునిపల్లి గ్రామ పంచాయతీ రంగారెడ్డిగూడకు చెందిన పోతుల శోభారాణి (30) అనే మహిళకు పది సంవత్సరాల క్రితం మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ గ్రామానికి చెందిన రాజుతో వివాహం జరిగింది. వీరికి మహేందర్ (7) అనే కొడుకు ఉన్నాడు. కొన్నాళ్ల పాటు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండటంతో.. ఇద్దరూ విడిపోయారు.
భర్త నుంచి విడిపోయి ఒంటరిగా బతుకుతున్న శోభారాణికి కోయిలకొండకు చెందిన నర్సింహలు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో.. నాలుగు సంవత్సరాల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి రెండున్నరేళ్ల మమత అనే కుమార్తె ఉంది. ఇదిలా ఉంటే గత కొన్ని నెలలుగా శోభ, నర్సింహులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో శోభ.. రంగారెడ్డిగూడలోని తన పుట్టింటికి వచ్చి.. బిడ్డలతో కలిసి అక్కడే ఉంటుంది. అయితే నర్సింహులు అప్పుడప్పుడు మద్యం తాగి శోభ పుట్టింటి వద్దకు వచ్చి గొడవలు చేస్తుండేవాడు.
ఈ క్రమంలో శనివారం రాత్రి పది గంటలకు నర్సింహులు.. శోభకు ఫోన్ చేసి ఆమె కొడుక్కి సైకిల్ కొనిపిస్తానని తెలిపి.. షాద్‌నగర్‌కు రమ్మన్నాడు. దీంతో ఆదివారం ఉదయం శోభ తన కుమారుడిని వెంట పెట్టుకుని షాద్‌నగర్‌కు వచ్చింది. సాయంత్రం వరకు నర్సింహులు కోసం ఎదురుచూసింది. అతను రాకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లింది. కుమారుడిని ఇంట్లో ఉంచి.. కుమార్తెతో కలిసి మళ్లీ కోయిలకొండకు బయలుదేరింది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. శోభ దారుణ హత్యకు గురైంది.
చిన్నారి ఏడుపులు విని..
ఆదివారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో.. స్థానిక గ్రామస్తుడు పొలం పనికి వెళ్తుండగా.. శివారులోని ఒక పొలంలో శోభ మృతదేహాన్ని చూశాడు. చిన్నారి తల్లి మృతదేహం పై పడి ఏడుస్తూ ఉండటం గమనించిన వ్యక్తి.. ఈ విషయాన్ని శోభ తల్లికి చెప్పాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎవరో ఆమె తలపై బండరాయితో మోది చంపినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. నర్సింహులే తన బిడ్డను హత్య చేసి ఉంటాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. షాద్‌నగర్ సీఐ కే సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
