Delhi Girl Missing: ఢిల్లీలో దారుణం.. యమునా నదిలో అమ్మాయి మృతదేహం.. 6 రోజుల తర్వాత లభ్యం.. అసలేం జరిగింది?

క్యాబ్ డ్రైవర్ స్నేహాను సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర వదిలేసి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగింది?

Delhi Girl Missing: ఢిల్లీలో దారుణం.. యమునా నదిలో అమ్మాయి మృతదేహం.. 6 రోజుల తర్వాత లభ్యం.. అసలేం జరిగింది?

Updated On : July 14, 2025 / 12:08 AM IST

Delhi Girl Missing: ఢిల్లీలో దారుణం జరిగింది. 6 రోజుల క్రితం అదృశ్యమైన అమ్మాయి శవమై కనిపించింది. యమునా నదిలో అమ్మాయి మృతదేహం లభ్యం కావడం సంచలనంగా మారింది. ఆ అమ్మాయి పేరు స్నేహా దేబ్ నాథ్. వయసు 19 ఏళ్లు. గత ఆరు రోజులుగా ఆమె కనిపించకుండా పోయింది. ఆమె గురించి పోలీసులు వెతుకుతున్నారు. ఇంతలో స్నేహా డెడ్ బాడీ కనిపించింది.

త్రిపురకు చెందిన స్నేహా ఢిల్లీలోని ఆత్మా రామ్ సనాతన ధర్మ కాలేజీలో బీఎస్ సీ సెకండియర్ చదువుతోంది. ఢిల్లీలోని పర్యావరణ్ కాంప్లెక్స్ లో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. జూలై 7 నుంచి స్నేహా కనిపించకుండా పోయింది. ఆమె కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇంతలో యమునా నదిలో స్నేహా మృతదేహ లభ్యమైంది. ఈస్ట్ ఢిల్లీలోని గీతా కాలనీలో యమునా నదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. క్యాబ్ డ్రైవర్ స్నేహాను సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర వదిలేసి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది మిస్టరీగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టత లేకపోవడంతో క్యాబ్ దిగిన తర్వాత స్నేహా ఏం చేసింది అనేది తెలియడం లేదు.

”జూలై 7న తన స్నేహితురాలిని సెంట్రల్ ఢిల్లీలోని రైల్వే స్టేషన్ లో దింపి వస్తానని చెప్పి స్నేహా వెళ్లింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆమె క్యాబ్ ను బుక్ చేసుకుంది. ఆ తర్వాత 9గంటల సమయంలో స్నేహా ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. వెంటనే స్నేహా ఫ్రెండ్ కి కాల్ చేశాను. అయితే, తాను స్నేహాను కలవలేదని ఆమె చెప్పింది. ఆ వెంటనే క్యాబ్ డ్రైవర్ నెంబర్ తీసుకుని కాల్ చేశాను. స్నేహాను వజీరాబాద్ లోని సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర డ్రాప్ చేసినట్లు క్యాబ్ డ్రైవర్ తెలిపాడు. అప్పటి నుంచి స్నేహా అదృశ్యమైంది. ఆ స్పాట్ నుంచి స్నేహాను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని మాకు అనుమానంగా ఉంది ” అని స్నేహ సోదరి తెలిపింది.

Also Read: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు.. 16లక్షల విలువైన పెళ్లి ఆభరణాలు.. వెనక్కి ఇచ్చేసిన సోనమ్ కుటుంబం..

స్నేహా కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్ సాయంతో ఏడు కిలోమీటర్ల పరిధిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కానీ, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. స్నేహా లాస్ట్ లొకేషన్ సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గరే చూపిస్తోంది. బ్రిడ్జిపై ఒక అమ్మాయి నిల్చుని ఉండటం తాను చూశానని స్థానికుడు తెలిపాడు. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయిందన్నాడు. చివరికి యమునా నదిలో స్నేహా డెడ్ బాడీ కనిపించింది. దీంతో అంతా షాక్ కి గురయ్యారు. అసలేం జరిగింది? అనేది మిస్టరీగా మారింది. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.