ఎదురుకాల్పుల్లో నలుగురు BSF జవాన్లు మృతి

లోక్ సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.ఈ సమయంలో గురువారం (ఏప్రిల్-4,2019) కన్కేర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతాబలగాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది.మహలా గ్రామానికి దగ్గర్లోని దట్టమైన అటవీప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ లో ఉన్న 114వ బెటాలియన్ పై మావోలు కాల్పులు జరిపారు. భద్రతాబలగాలు కూడా ధీటుగా కాల్పులను తిప్పికొట్టాయి. అయితే ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు చనిపోయారు. మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్(యాంటీ నక్సల్స్ ఆపరేషన్)సుందర్ రాజ్ తెలిపారు.
ఎన్నికల బహిష్కరించాలని మావోయిస్టులు ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.రెండో ఫేజ్ లో భాగంగా ఏప్రిల్-18న కన్కేర్ లోక్ సభ స్థానంతో పాటు రాజ్ నంద్ గాన్,మహసముంద్ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఆదివారం (మార్చి-31,2019) కూడా దంతెవాడ జిల్లాలో భద్రతాబలగాలు టార్గెట్ గా బాంబులు ఫిక్స్ చేస్తున్న ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన వారిలో ఓ మహిళ కూడా ఉంది.అరెస్ట్ అయిన వారి నుంచి ఓ టిఫిన్ బాంబ్,మూడు గ్రనేడ్-హెడెడ్ బాణాలు స్వాధీనం చేసుకున్నట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు.