విశాఖ మన్యంలో ఎన్ కౌంటర్ : ఐదుగురు మావోలు మృతి

విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివారం మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఏజెన్సీలోని జీకే వీధి మండలం మాదిగ మల్లులోని ధారకొండ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. సెప్టెంబర్ 21 నుంచి 28 వరకు మవోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నాయి.
ఈ సమయంలో మావోయిస్టుల కదలికలు ఉంటాయని పసిగట్టిన పోలీసులు వారిపై నిఘా పెంచారు. ఆదివారం వారోత్సవాల సందర్భంగా మావోయిస్టులు సమావేశం అవుతున్నారనే సమాచారం తెలుసుకుని ఎస్పీఎఫ్ గ్రే హౌండ్స్ దళాలు దాడి చేశాయి. ఈ ఘటనలో కోందరు మావోయిస్టులు తప్పించుకు పారిపోయినట్లు సమాచారం. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
సెప్టెంబర్21 నుంచి విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో కరపత్రాలు పొస్టర్లు ద్వారా గిరిజనులను చైతన్య పరుస్తున్నారు. సెప్టెంబర్ 23.2018 న గ్రామదర్శిని కార్యక్రమానికి వెళుతున్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ లను మావోయిస్టులు హత్య ఛేసారు. అప్పటి నుంచి మావోలపై పట్టు సాధించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మావోల వారోత్సవాలు విఫలం చేసేందుకు పోలీసులు, విజయవంతం చేసుకునేందుకు మావోయిస్టులు పోటా పోటీగా కరపత్రాలు, పోస్టర్లు విడుదల చేశారు. గత ఏడాదిగా కూంబింగ్ జరుగుతున్నప్పటికీ ప్రశాంతంగా ఉన్నఏజెన్సీ ప్రాంతాలు ఆదివారం నాటి ఎన్ కౌంటర్ తో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.