సుజిత్ తర్వాత శివాని: బోరుబావికి మరో చిన్నారి బలి

సుజిత్ తర్వాత శివాని: బోరుబావికి మరో చిన్నారి బలి

Updated On : November 4, 2019 / 7:15 AM IST

బోరు బావుల పట్ల అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యానికి మరో చిన్నారి బలైపోయింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో సుజిత్ ఘటన మరచిపోక ముందే మరో ఘోరం జరిగింది. హర్యానాలోని హారి సింగ్ పురా గ్రామంలో ఐదేళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటనలో బావిలో పడిన చిన్నారి మృతి చెందింది. అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినా ప్రాణాలు కాపాడలేకపోయారు. 

కర్నాల్ లోని ఘరుదాలో హర్ సింగ్ పురా గ్రామంలో ఆదివారం (నవంబర్ 3) సాయంత్రం చిన్నారి బోరుబావిలో పడింది. ఆడుకుంటూ ఉన్న ఐదు సంవత్సరాల శివాని ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చిన్నారిని వెలికితీసే ప్రయత్నాలు చేపట్టారు. చిన్నారి 50 అడుగుల లోతులో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. పైపుల ద్వారా వైర్ లూప్‌ వేసి లోపలికి ఆక్సిజన్‌ పంపినా ప్రాణాలు దక్కలేదు. మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. 

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో 4 రోజుల క్రితం ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన సుజిత్ మృతి చెందిన విషయం తెలిసిందే. కుళ్లిపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు. కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన బోరుబావి కోసం ఎటువంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదు.