ఆడుకుంటూ వెళ్లి నాలాలో పడి మూడేళ్ల చిన్నారి మృతి

వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. గిరిప్రసాద్ నగర్ లో పొంగుతున్న నాలాలో పడి మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ నగరంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాలాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో వరంగల్ శంబునిమెట్ మెంట్ సమీపంలో గిరిప్రసాద్ నగర్ కాలనీలో పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి పొంగుతున్న నాలాలో పడి కొట్టుకుపోయింది.
ఆ నాలాలో మునిగిన వెంటనే సమీపంలో ఉన్న పిల్లలంతా అరుపులు, కేకలు వేయడంతో పాప సంబంధీకులు వెంటనే నాలాలోకి దిగి పాపను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నాలాలో పడి నీరు మింగడంతోటి చిన్నారి చనిపోయింది. పాప కుటుంబ సభ్యులు, బంధువులు, గిరిప్రసాద్ నగర్ కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కచ్చితంగా వరంగల్ నగర కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ చిన్నారి మృతి చెందిందని తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు నాలా మీద శ్రద్ధ చూపకపోవడం వల్లనే పొంగుతున్న నాలా మూడేళ్ల పాప ప్రాణం తీసిందని చెప్పవచ్చు.