సింగపూర్ తరహా రాజధాని ఇదేనా : ప్రేమికులపై దాడులు

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదా ? అంటే జరుగుతున్న ఘటనలు..పరిణామాలు చూస్తుంటే ఎస్ అనిపిస్తోంది. మహిళల భద్రతపై పాలకులు ఎన్ని మాటలు చెబుతున్నా అవన్నీ ఉట్టిమాటలే అని తేలిపోతున్నాయి. దాడులు చేసినా..ఇతర అఘాయిత్యాలకు పాల్పడినా..కఠినంగా శిక్షలు వేస్తామని చెబుతున్నా మృగాలు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రధానంగా ప్రేమికులపై దాడులు జరుగుతుండడం కలకలం రేపుతోంది. ఎన్ని ఘటనలు జరిగినా ఏపీ రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఏడాది వ్యవధిలో రాజధాని అమరావతి ప్రాంతంలో 4 వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రేమికులపై దాడులు మరింతగా పెరుగుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతంలో లవర్స్ ఉంటే చాలు…వారిపై దాడికి పాల్పడి..యువతులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
నవులూరు వద్ద ప్రేమ జంటపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి..యువతిని హత్య చేసి..యువకుడిని తీవ్రంగా గాయపరిచిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రాజధాని ప్రాంతంలో ప్రేమ జంటలపై దాడులు, యువతులపై అత్యాచార ఘటనలు మరిన్ని జరిగాయని టాక్. సింగపూర్ తరహా రాజధాని అంటే ఇదేనా అని అక్కడి జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా బాబు సర్కార్..ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
– గత ఏడాది సీతానగరం రైల్వే బ్రిడ్జీపై ప్రేమికులను బెదిరించి ప్రియుడిని చావగొట్టారు. యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించారు. అటువైపు వస్తున్న వారిని గమనించి దుండగులు పారిపోయారు. తాజా ఘటనతో రాజధాని వాసులే కాక ఇతర ప్రాంతాల వాసులు హఢలిపోతున్నారు.
– 2018 ఆగస్టులో చినకాకాని రాజ్ కమల్ రోడ్డులో ఓ కానిస్టేబుల్ యువతితో ఉంటే..వీరిపై నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడి బంగారం దోచుకున్నారు. అంతేగాకుండా యువతిపై అత్యాచారం చేసేందుకు ఒడిగట్టారు. స్థానికుల సహయంతో వారు పరార్ అయ్యారు.
– మంగళగిరి మండలం పెదవడ్లపూడి సమీపంలోని కోకకోలా ఫ్యాక్టరీ వద్ద నిర్జన ప్రదేశంలో ప్రేమ జంటపై దాడి జరిగింది. ముగ్గురు యువకులు ప్రియుడిన కొట్టి చంపేశారు. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.