రూ.20కోట్లు దోచేశాడు : పీఎస్‌లో లొంగిపోయిన పవన్
హైదరాబాద్: నగరంలో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను దోచేసిన వైనం బయటపడింది. అయినకాడికి దోచేయడం ఆ తర్వాత చేతులెత్తేయడం మామూలైపోయింది. కేపీటీఎస్ పేరుతో సంస్థ ఏర్పాటు చేసిన పవన్ అనే వ్యక్తి జాబ్స్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడు. ఉద్యోగాల పేరుతో 600 మంది నుంచి రూ.20కోట్లు వసూలు చేశాడు. అదిగో ఇదిగో అంటున్నాడు తప్ప ఉద్యోగాలు మాత్రం చూపించడం లేదు. రోజులు గడిచే కొద్ది బాధితుల్లో ఆందోళన పెరిగిపోయింది. దీంతో డబ్బు ఇచ్చిన వారు ఉద్యోగాల కోసం పవన్‌పై ఒత్తిడి తెచ్చారు. లేదంటే తమ డబ్బు తమకు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో పవన్ మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. విషయం తెలుసుకున్న బాధితులు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. తమ డబ్బు తమకు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.