OTP, KYC మోసాలతో జాగ్రత్త.. అకౌంట్లలో ఉన్నదంతా ఊడ్చేస్తారు..!.

ఈ ఓటీపీలు.. కేవైసీలే కాదు.. సైబర్ ఫ్రాడ్స్‌లో ఇంకా చాలా ఉంటాయ్. బ్యాంక్ లోన్స్ అని.. ఆన్‌లైన్‌లో కార్ల కొనుగోళ్లని.. ఫేక్ ఎన్జీవోలకు.. డొనేషన్లని.. గిఫ్ట్‌లని.. ఉద్యోగాలని.. చాలా ఉంటాయ్. ఇలా కూడా మోసపోవచ్చా.. అనేలా మోసపోయారు కొందరు బాధితులు. అందుకే.. సైబర్ నేరగాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే.. మనం చెప్పేదంతా విని.. అకౌంట్‌లో ఉన్నదంతా ఊడ్చేస్తారు. తర్వాత బాధితులు ఏడ్చేస్తారు.
OLX, గిఫ్ట్‌లు, ఉద్యోగాల పేరుతో మోసాలు :
ఎప్పుడూ కనిపించని మెసేజ్.. ఫోన్‌లో కొత్తగా కనిపించిందంటే.. దాన్ని అనుమానించాల్సిందే. ఎప్పుడూ EMIలు కట్టండంటూ వచ్చే కాల్స్.. సడన్‌గా లోన్ ఇస్తామని వస్తే డౌట్ పడాల్సిందే. లేకపోతే.. గట్టి పంచ్ పడుతుంది. మీ బ్యాంక్ అకౌంట్‌కు చిల్లు పడుతుంది. ఎస్.. ఈ మధ్య ఈ తరహా మోసాలే ఎక్కువై పోతున్నాయ్.
క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుతాం. అవసరం లేకపోయినా.. పర్సనలో లోన్ ఇస్తామంటూ కాల్స్ వచ్చాయంటే.. సింపుల్‌గా కాల్ కట్ చేయడం బెటర్. అంతకుమించి.. ఒక్క మాటైనా ఎక్స్‌ట్రా మాట్లాడారో.. ఖాతాలో ఉన్నదంతా ఊడ్చిపారేస్తారు.
ఈ మధ్యే హైదరాబాద్‌లో ఓ మహిళకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అవసరం లేకపోయినా.. తనకు 4 లక్షల 70 వేల లోన్ వచ్చేలా చేశారు. అమౌంట్.. ఆవిడ అకౌంట్‌లో క్రెడిట్ అయిన గంటల్లోనే.. సైబర్ నేరగాళ్లు.. ఆమె ఖాతా నుంచి ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నారు. ఆవిడ తేరుకునేలోపే.. ఖాతాలో డబ్బు జమ అవడం.. విత్ డ్రా అవడం కూడా జరిగిపోయింది. తానెంత వద్దని చెప్పినా వినకుండా.. తనకు లోన్ మంజూరు చేశారని ఆవిడ చెప్పుకొచ్చింది. తర్వాత.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆన్‌లైన్‌లో.. సెకండ్ హ్యాండ్ వెహికిల్స్ చూస్తున్నారా? :
ఎప్పుడూ గూగుల్ పేలోని స్క్రాచ్ కార్డులో రూపాయి కూడా రాని మనకు.. సడన్‌గా ఓ ఫోన్ కాల్ వచ్చి.. మీ పేరు మీద గిఫ్ట్ వచ్చింది.. ఎయిర్‌పోర్టులో ఆగిపోయింది.. కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి. అందుకు మీరు డబ్బులు పంపించాలి లాంటి ఫోన్ కాల్ వచ్చిందంటే.. అది మీకు టోపీ పెట్టేందుకేనని అర్థం చేసుకోవాలి.
ఈ మధ్యే.. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు.. ఇలాంటి ఫోన్ కాలే వచ్చింది. తన పేరు గిఫ్ట్ వచ్చిందని.. అందులో విలువైన వస్తువులు ఉన్నాయని చెప్పారు. ఆ గిఫ్ట్ ప్యాక్ డెలివరీ చేయాలంటే.. కస్టమ్స్, జీఎస్టీ, ఐటీ చార్జీల పేరుతో.. ఆరున్నర లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయాలని అడిగారు. ఆ ఫేక్ గిఫ్ట్ కాల్ నమ్మిన మహిళ.. కేటుగాళ్లకు ఆరున్నర లక్షలు ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసింది. అంతే.. మళ్లీ ఆవిడ కాల్ ఎత్తితే ఒట్టు.
మీరు ఊహించనంత తక్కువ ధరకు కనిపించిందా? :
అలాంటి యాడ్ చూసి.. క్లిక్ చేసి.. కాల్ చేస్తే.. షాక్ తప్పదు. ఆలోచించకుండా అడుగేస్తే.. మీ అకౌంట్‌లో పిడుగు పడ్డట్లే. ఏమాత్రం.. తొందపడడ్డా.. సైబర్ నేరగాళ్ల చేతిలో నిలువుదోపిడీకి గురయ్యే ప్రమాదముంది. ఓఎల్ఎక్స్ వేదికగా.. హైదరాబాద్ వాసులను టార్గెట్ చేశారు సైబర్ కేటుగాళ్లు. సిటీలోని 3 కమిషనరేట్ల పరిధిలో.. గతేడాది.. 13 కోట్లకు పైనే మోసగించారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఆ మధ్య తక్కువ ధరకే ట్రాక్టర్ అంటూ.. ఓ పోస్ట్ పెట్టారు సైబర్ కేటుగాళ్లు. అది చూసి.. బషీర్‌బాగ్‌కు చెందిన ఓ వ్యక్తి వాళ్లకు కాల్ చేశాడు. అతడి దగ్గర్నుంచి.. లక్షన్నరకు పైనే కొట్టేశారు. తక్కువ ధరకే ట్రాక్టర్ వస్తుందని.. ఆశపడి ఫోన్ చేసిన వ్యక్తికి.. తాను ఆర్మీ అధికారినని, ట్రాక్టర్ డైరెక్ట్‌గా డెలివరీ ఇవ్వడం వీలుకాదని నమ్మబలికారు.
ఆర్మీ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా.. ట్రాక్టర్ పంపిస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మి.. ప్రాసెసింగ్, ఇతర చార్జీల పేరుతో.. లక్షన్నరకు పైనే ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేశాడు. తర్వాత.. ట్రాక్టర్ డెలివరీ చేయకపోవడం, మొబైల్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో.. తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఆన్ లైన్ వెబ్ సైట్లతో జర భద్రం :
ఆన్‌లైన్ వెబ్ సైట్లలో.. తక్కువ ధరలకు వాహనాలు, వస్తువులు కొనుగోలు, అమ్మకాలు జరపొద్దని.. పోలీసులు సూచిస్తున్నారు. భరత్‌పూర్, మేవట్‌కు చెందిన సైబర్ నేరగాళ్లు.. ఇలాంటి వెబ్ సైట్లపై తిష్టవేశారని చెబుతున్నారు. అలాంటి.. సైట్లపై చర్యలు తీసుకోవాలంటూ.. కేంద్రానికి సైబరాబాద్ పోలీసులు లేఖ కూడా రాశారు. ఇలాంటి వెబ్ సైట్లకు సంబంధించిన మోసాలపైనే.. సీసీఎస్‌లో ఎక్కువ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
ఫేక్ ఎన్జీవోల పేరుతో సైబర్ మోసాలు :
ఫేక్ ఎన్జీవోల పేరుతో కూడా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కరోనా బాధితులకు సాయం చేస్తాం. వారిని ఆదుకుంటాం.. మీరు సాయం చేయగలరా.. వారికి కొత్త జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా అంటూ.. పబ్లిక్‌లో ఉన్న సేవాగుణాన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నారు. కరోనా బాధితుల పేరిట.. విరాళాలు సేకరించడం.. ఐదారుగురికి ఇవ్వడం.. మిగిలిన సొమ్మంతా.. కాజేయడం లాంటివి చేస్తున్నారు. డొనేషన్లు ఇచ్చిన వారు.. తర్వాత అసలు విషయం తెలుసుకొని.. షాక్ అవుతున్నారు.
పబ్లిక్ వీక్ పాయింట్స్ మీద కూడా దందా నడుపుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఫేస్‌బుక్, వాట్సాప్, వ్యక్తిగత డేటా తీసుకొని.. పరిచయస్తుల పేర్లతో మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారు. బాధితుల స్నేహితులకు, బంధువులకు.. హెల్త్ ఎమర్జెన్సీ ఉందంటూ.. డబ్బులు రాబడుతున్నారు. డబ్బులు పంపాక.. బాధితులు ఎంక్వైరీ చేస్తున్నారు. మోసపోయామని తెలుసుకొని.. ఫిర్యాదు చేస్తున్నారు. అందుకే.. ఎవరూ వ్యక్తిగత ఫోన్ నెంబర్లను సోషల్ మీడియాలో పెట్టొద్దని చెబుతున్నారు. తెలిసిన వారి ఆరోగ్యం బాలేదంటూ ఫోన్ కాల్స్, మెసేజెస్ వస్తే.. క్రాస్ చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. కరోనా టైంలో.. మాస్కులు, శానిటైజర్ల పేర్లతో కూడా సైబర్ క్రైమ్ కేటుగాళ్లు చీటింగ్‌కి పాల్పడుతున్నారు. ఇలాంటి కాల్స్ పట్ల.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.