OMG : గొంతులో మాత్ర ఇరుక్కుని బాలుడి మృతి

మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. గొంతులో మాత్ర ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందాడు. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం కేంద్రానికి చెందిన మహ్మద్ నజీర్, మీనా దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు జిషాన్ (5) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బాలుడు కోలుకోవడానికి తల్లి మందు గోళి వేసింది.
అది గొంతులో అడ్డుకోవడంతో జిషాన్ ఊపిరాడక విలవిలలాడాడు. తల్లి బాలుడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా అతను ప్రథమ చికిత్స చేశారు. అయినా మాత్ర బయటికి రాకపోవడంతో పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
మెదక్ పిల్లల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో చిన్నారి జిషాన్ చనిపోయాడు. బాలుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఎక్కువ మోతాదున్న మాత్ర ఇవ్వడంతోనే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు అంటున్నారు. చిన్న పిల్లలకు మాత్ర వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.