వేలిముద్రలు వేస్తున్నారా? మీ ఖాతా ఖాళీ అయినట్టే.. చెక్ చేసుకోండి!

Fraud with your Fingerprints through Pay Point : అడిగారని.. ఎక్కడిపడితే అక్కడ వేలిముద్రలు వేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ ఫింగర్ ఫ్రింట్స్.. సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తే ఇక అంతే.. మీ అకౌంట్ ఖాళీ అయినట్టే… ఓసారి చెక్ చేసుకోండి.. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై వేలిముద్రలు పెడుతున్నారా? అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే.. సైబర్ నేరగాళ్ల నిఘా ఫింగర్ ఫ్రింట్లపైనే పడింది. నేరగాళ్లకు ఈ వేలిముద్రలు చిక్కితే వేలు పోతాయ్ జాగ్రత్త అంటున్నారు సైబర్ నిపుణులు.
పే పాయింట్ అకౌంట్ ద్వారా నగదును సైబర్ కేటుగాళ్లు కాజేస్తున్నారు. ఈ కొత్త తరహా చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మధురా నగర్ కాలనీకి చెందిన ఓ వ్యాపారికి చెందిన బ్యాంకు అకౌంట్లో రూ.10వేలు కొట్టేశారు సైబర్ కేటగాళ్లు. నిన్నటివరకు అకౌంట్లో ఉన్న నగదు మొత్తం ఖాళీ కావడంతో బాధితుడు షాకయ్యాడు. తనకు తెలియకుండా అకౌంట్లో నగదు ఎవరూ విత్ డ్రా చేశారో తెలియక ఆందోళన చెందాడు. వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించాడు..
పే పాయింట్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా అయినట్టు చెప్పారు. బాధితుడు ఎస్ ఆర్ నగర్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పే పాయింట్ ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురానికి చెందిన సీఏ విద్యార్థులే ఈ మోసానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఏపీకి చెందిన భూములు, ప్లాట్లకు సంబంధించిన www.igrs.ap. gov.in వెబ్‌సైట్ నుంచి సిద్దిరెడ్డికి చెందిన ల్యాండ్ డాక్యుమెంట్లను నిందితులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లలో వ్యాపారికి చెందిన ఆధార్‌కార్డు నెంబరు, వేలిముద్రలను సేకరించారు. పే పాయింట్ అకౌంట్‌లో బాధితుడి ఆధార్ నెంబరు, వేలిముద్రలను స్కాన్ చేసి నగదును కాజేశారు.