బట్టతల మొగుడు నాకొద్దు… పెళైన ఐదేళ్లకు బయటపడిన నిజం

Woman filed a complaint, agaiant Husband For Hiding His Baldness : అందమైన క్రాఫుతో అచ్చం సినీ హీరోలా ఉన్నఅబ్బాయితో యువతి పెళ్లైంది. పెళ్లైన ఐదేళ్లకు తన భర్తది నిజమైన జుట్టుకాదని, విగ్గు అని తెలిసి అవాక్కైంది. విగ్గు మొగుడు నాకొద్దు అని, మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మొగుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివిరాల్లోకి వెళితే….. చెన్నై అలపాక్కం కు చెందిన రాజశేఖర్ కు 27 ఏళ్ల యువతితో 2015లో వివాహం అయ్యింది.
రాజశేఖర్ కు అప్పటికే బట్టతల ఉండటంతో పెళ్లి చూపులకు విగ్గు పెట్టుకుని హజరయ్యాడు. ఆమెతో వివాహం నిశ్చయమయ్యాక ఆవిషయం చెప్పకుండా దాచి, పెళ్లికి కూడా విగ్గుపెట్టుకునే కూర్చున్నాడు. మంచి నాణ్యమైన వెంట్రుకలతో చేసిన విగ్గుకావటంతో ఎవరూ తేడా గుర్తించలేక పోయారు. కొత్త కాపురం సజావుగా సాగిపోతోంది. కాలక్రమంలో ఐదేళ్లు గడిచిపోయాయి.
ఈ ఐదేళ్లలో ఎప్పుడూ తన తలపై ఉన్నది విగ్గు అని భార్యకు, ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు రాజశేఖర్. ఇటీవల ఒకరోజు రాజశేఖర్ తలపై విగ్గులేకుండా చూసింది భార్య. ఒక్కసారి షాక్ కు గురైంది. మోసం చేసి పెళ్లి చేసుకున్నావని గొడవ పెట్టింది. దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి.
పెళ్లి సమయంలో ఇచ్చిన రూ.2 లక్షల నగదు, 50 సవర్ల బంగారు నగలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. దీంతో ఆమె పై అత్తమామఆడపడుచులు దాడి చేసి గాయ పరిచారు. విగ్ పెట్టుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు చెన్నైలోని తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.