ఐదేళ్లలో 49 మంది నవోదయ విద్యార్థుల ఆత్మహత్య

ఢిల్లీ : ఎంతో భవిష్యత్ ఉన్న విద్యా కుసుమాలు రాలిపోతున్నాయి. మంచిగా చదివి భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలు ఫలితాలకు పెట్టింది పేరు. నవోదయ విద్యాలయాలు విద్యార్థులను మట్టిలో మాణిక్యాల లాగా తయారు చేస్తాయి. అలాంటి విద్యాలయాల్లో మృత్యు ఘోష వినిపిస్తోంది. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఐదేళ్లలో 49 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.
2013 నుంచి 2017 వరకు పరిశీలిస్తే మొత్తం 49 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఏడుగురు తప్ప మిగిలిన వారంతా ఉరి వేసుకుని మృతి చెందారు. మృతుల్లో సగం మంది దళితులు, గిరిజన విద్యార్థులు కావడం శోచనీయం. వీరిలోనూ ఎక్కువ మంది బాలురు ఉన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు అధికంగా వేసవి సెలవుల అనంతరం, పరీక్ష సమయాల్లో ఎక్కువగా నమోదవడం గమనార్హం.
వేసవి సెలవుల్లో ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో గడిపి వస్తున్నారని, మళ్లీ వెంటనే పాఠశాల జీవితానికి కొంత ఇబ్బంది పడుతున్నారని విద్యాలయాల కమిషనర్ బిశ్వజిత్ కుమార్ సింగ్ తెలిపారు.
కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటంతో కొంత ఒత్తిడికి గురవుతుంటారని పేర్కొన్నారు.
విద్యార్థుల ఆత్మహత్య జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన వార్తా కథనాలపై స్పందిస్తూ దీనిపై ఆరు వారాల్లోగా వివరాలు సమర్పించాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖకు నోటీసులు జారీ చేసింది. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి సుశిక్షితులైన కౌన్సిలర్లు ఉన్నారా అని ప్రశ్నించింది.