Mystery Death: 40రోజుల క్రితమే కొత్త ఇంట్లోకి వెళ్లిన వృద్ధ దంపతులు, ఇంతలోనే దారుణం జరిగిపోయింది.. అసలేం జరిగింది?
కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి గొంతులు కోసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు.

Crime
Mystery Death: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన సంచలనం రేపింది. నగర వాసులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. జనచైతన్య కాలనీ ఫేజ్-2లో శుక్రవారం ఉదయం ఈ దారుణం వెలుగుచూసింది.
ఆయన పేరు షేక్ అబ్దుల్లా (70). భార్య రిజ్వానా (65). రాజేంద్రనగర్ జనచైతన్య కాలనీ ఫేజ్-2లో నివాసం ఉంటున్నారు. షేక్ అబ్దుల్లా ఎస్బీఐలో ఉన్నత ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. రిజ్వానా లెక్చరర్‌గా పని చేసి పదవీ విరమణ చేశారు. ఇటీవలే వీరు ప్రాంతంలో సొంతిల్లు కట్టుకున్నారు. 40 రోజుల క్రితం గృహప్రవేశం చేశారు. అంతా హ్యాపీగా గడిచిపోతోంది. వృద్ధ దంపతులు ఎంతో ఆనందంగా జీవితం గడుపుతున్నారు. ఇంతలో ఊహించని ఘోరం జరిగింది.
గురువారం సాయంత్రం ఇద్దరు దుండగులు అబ్దుల్లా ఇంటికి వెళ్లారు. అక్కడే ఉన్న వాచ్ మెన్ వారిని ఎందుకు వచ్చారని అడిగాడు. ఫిజియోథెరపీ చేయడానికి వచ్చామని వారు చెప్పడంతో వాచ్ మెన్ ఏమీ అనలేదు. ఆ తర్వాత వారు దంపతులు ఉంటున్న ఇంట్లోకి వెళ్లారు. సుమారు గంటన్నర తర్వాత ఒకరు బయటకు వచ్చారు. కాసేపటికి మరొకరు వచ్చారు. అలా ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. శుక్రవారం ఉదయం ఎంతసేపు అవుతున్నా దంపతులు బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కి చేరుకున్న పోలీసులు లోపలికి వెళ్లి చూడగా షాక్ అయ్యారు. వృద్ధ దంపతులు రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించారు.
కత్తులతో దంపతులపై విచక్షణారహితంగా దాడి చేసి గొంతులు కోసి హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. షేక్ అబ్దుల్లా శరీరంపై ఏడు కత్తిపోట్లు, రిజ్వానా ఛాతీపై ఒక కత్తిపోటు ఉన్నట్లు గుర్తించారు. ఫిజియోథెరపీ నెపంతో ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. అసలేం జరిగింది? వచ్చిన వారు ఎవరు? వృద్ధ దంపతులను ఎందుకు ఇంత కిరాతకంగా చంపారు? దేని కోసం ఇంత దారుణానికి ఒడిగట్టారు? ఇలాంటి సందేహాలు ఎన్నో.
దోపిడీ చేయడానికి వచ్చారా? ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశాం. కాగా, రిటైర్ అయ్యాక హ్యాపీగా జీవితం గడుపుతున్న దంపతులు ఇలా దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే ఇలాంటి దారుణం జరగడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది.