అమ్మాయిలే వీరి టార్గెట్‌.. ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్

  • Published By: sreehari ,Published On : July 30, 2020 / 11:21 PM IST
అమ్మాయిలే వీరి టార్గెట్‌.. ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్

Updated On : July 31, 2020 / 6:46 AM IST

సోషల్ మీడియాని కూడా సైబర్ క్రిమినల్స్ వదలట్లేదు. అమ్మాయిలే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. ఫోటోలు మార్ఫ్ చేసి.. బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేస్తామంటూ.. వేలు, లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ కరోనా టైమ్‌లో.. ఇలాంటి కేసులు కూడా ఎక్కువగా నమోదయ్యాయ్.

ఫోటోలు మార్ఫింగ్ మోసాలు :
ఫేస్‌బుక్, ఇన్ స్టా గ్రాంలో.. అమ్మాయిలు, మహిళలను పరిచయం చేసుకోవడం.. కొన్నాళ్లు వాళ్లతో చాటింగ్ చేయడం.. ఆ తర్వాత వాళ్లను బ్లాక్ మెయిల్ చేయడం.. సైబర్ నేరగాళ్లకు దందాగా మారిపోయింది. ఎఫ్బీ, ఇన్ స్టా అకౌంట్ల నుంచి అమ్మాయిల ఫోటోలు తీసుకొని.. వాటిని మార్ఫ్ చేసి.. మాయ చేసేస్తున్నారు కేటుగాళ్లు. ఆ ఫోటోలను.. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని.. పోర్న్ సైట్లలో పెడతామని బెదిరిస్తూ.. బాధితుల నుంచి లక్షలు గుంజుతున్నారు.




మహిళలతో పరిచయం పెంచుకుని :
యూకేలో మత బోధకుడినంటూ.. హైదరాబాద్‌కి చెందిన ఓ మహిళతో ఒకతను పరిచయం పెంచుకున్నాడు. వాట్సాప్‌లో చాట్ చేశాడు. ఇండియాలో కరోనా ఎక్కువగా ఉందని.. పేదలకు హెల్ప్ చేసేందుకు గిఫ్ట్‌లు, కరెన్సీ పంపిస్తున్నానని నమ్మించాడు.

తర్వాత.. కేటుగాళ్లలోని కొందరు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ఫోన్ చేస్తున్నానని నమ్మించి.. కస్టమ్స్, ఐటీ, జీఎస్టీ కట్టకపోతే క్రిమినల్ కేసు పెడతామంటూ బెదిరించారు. దీంతో.. ఆ మహిళ.. ఆన్ లైన్ ద్వారా 11 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. తర్వాత.. మోసపోయానని తెలుసుకొని.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.


మణికొండలో నివాసముంటున్న ఓ ఫర్నిచర్ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన హితేందర్ సింగ్.. కొద్దిరోజుల కిందటే ఫ్యామిలీతో హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. అతనికి.. జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెతో నమ్మకంగా ఉంటూనే.. ఆవిడ పర్సనల్ ఫోటోలను సేకరించాడు.

వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కి దిగాడు. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే.. సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. హితేందర్ సింగ్ వేధింపులు తట్టుకోలేక.. బాధితురాలు సీసీఎస్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

ఫోన్ హ్యాక్ చేసి బ్లాక్ మెయిలింగ్ :
ఈ మధ్యే.. కర్నూలుకు చెందిన ఓ యువకుడు కూడా ఇలాంటి పనే చేశాడు. సోషల్ మీడియాలో అమ్మాయిల ప్రొఫైల్స్ సెర్చ్ చేసి.. వాళ్ల ఫోన్ నెంబర్లు సేకరించి.. బ్లాక్ మెయిలింగ్‌కి దిగాడు. మార్ఫింగ్ ఫోటోలు వాట్సాప్ చేసి.. డబ్బులు డిమాండ్ చేశాడు. చాలా మంది అమ్మాయిలు.. ఇతని వలలో పడి మోసపోయారు.


ఈ మధ్యే.. హైదరాబాద్ కు చెందిన యువతిని కూడా ఇలాగే ట్రాప్ చేయబోయాడు. కానీ.. సీన్ రివర్సైంది. హైమద్ వాలకాన్ని గమనించిన యువతి.. డైరెక్ట్‌గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను.. వంద మందికి పైగా అమ్మాయిలను మోసం చేసినట్లు గుర్తించారు పోలీసులు. అటు రాజమండ్రి సమీపంలోని రామచంద్రరావుపేటకు చెందిన వంశీకృష్ణ అలియాస్‌ హర్ష ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలున్న మెడికల్ స్టూడెంట్స్ టార్గెట్ గా ఆరేళ్ల నుంచి మోసాలకు పాల్పడు తున్నాడు. హైదరాబాద్‌లో తాను ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ యజమానినంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పెట్టేవాడు.

బర్త్ డే రోజున గిఫ్ట్ లు పంపేవాడు. ఫోన్ కాల్స్, చాటింగ్ చేస్తూ నమ్మకంగా ఉండేవాడు. ఆ తర్వాత అవసరం పేరుతో డబ్బు అడిగేవాడు. అలా చాలాసార్లు అమ్మాయిల్ని చీట్ చేశాడు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో చదివే విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హర్ష అసలు బాగోతం వెలుగులోకి వచ్చింది.

45 మంది వైద్య విద్యార్థులకు వల విసిరి :
బెయిల్ పై విడుదలైన హర్ష హైదరాబాద్ కు మకాం మార్చాడు. ఏడాదిన్నర వ్యవధిలో హైదరాబాద్‌, విజయవాడల్లో చదువు కుంటున్న 45 మంది వైద్య విద్యార్థినులను పరిచయం చేసుకుని 3.2 కోట్లు వసూలు చేశాడు. ఓ వైద్య విద్యార్థిని నుంచి 40 లక్షల విలువైన బంగారు ఆభరణాలు రాబట్టాడంటే.. వాడెంత కన్నింగో అర్థం చేసుకోవచ్చు.


డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితురాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న యువతులు, మహిళలతో సైబర్‌ నేరగాళ్లు మర్యాదగా మాట్లాడుతారని.. ఆ తర్వాత నీట్ గా చీట్ చేస్తారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులతో 2 నెలల్లో ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. అపరిచితులతో చాటింగ్ చేయొద్దని.. వాళ్ల రిక్వెస్ట్‌లు పట్టించుకోవద్దని సజెస్ట్ చేస్తున్నారు.