Robbery: 25 కోట్ల రూపాయల విలువ చేసే 30 కేజీల నగల దోపిడీ..

ఆదివారం రాత్రి యజమానులు దుకాణం మూసివేశారు. సోమవారం సెలవు కావడంతో మంగళవారం షాపు తెరిచే సరికి.. అక్కడ సీన్ చూసి అంతా అవాక్కయ్యారు.

Robbery: 25 కోట్ల రూపాయల విలువ చేసే 30 కేజీల నగల దోపిడీ..

Delhi sensational Rs 25 crore jewellery heist 3 accused arrested some gold recovered

Updated On : September 29, 2023 / 2:42 PM IST

Delhi Gold Robbery Case: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన రూ. 25 కోట్ల నగల దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఢిల్లీ పోలీసుల బృందం.. ప్రధాన నిందితుడు లోకేష్ శ్రీవాస్తవ, శివ చంద్రవంశీతో పాటు మరొక వ్యక్తిని అరెస్టు చేసింది. దోపిడీకి గురైన బంగారు, వజ్రాభరణాల్లో చాలా వరకు నిందితుల నుంచి రికవరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ముఠా దోపిడీలకు పాల్పడినట్టు గుర్తించారు.

లూటీ జరిగిందిలా..
దక్షిణ ఢిల్లీలోని జంగ్‌పురాలో ఉన్న ఉమ్రావ్ సింగ్ జ్యువెలర్స్‌ నగల దుకాణంలోకి చొరబడిన ముగ్గురు దుండగులు దాదాపు 25 కోట్ల రూపాయల విలువచేసే ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పక్కా ప్లాన్ తో లూటీకి పాల్పడిన తీరు పోలీసులను సైతం నివ్వెరపరిచేలా చేసింది. అలామ్ సిస్టమ్, సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి దుండగలు ఈ భారీ దోపిడీకి పాల్పడ్డారు.

ఆదివారం రాత్రి యజమానులు దుకాణం మూసివేశారు. సోమవారం సెలవు కావడంతో మంగళవారం షాపు తెరిచే సరికి.. అక్కడ సీన్ చూసి అంతా అవాక్కయ్యారు. ఆభరణాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ కు పెద్ద కన్నం కనబడడంతో లూటీ జరిగినట్టు గుర్తించారు. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దుకాణం పూర్తిగా తెలిసిన వారో, మాజీ ఉద్యోగుల్లో ఎవరైనా దోపిడీకి పాల్పడి ఉండొచ్చని అనుమానించారు.

నగల దుకాణానికి ఆనుకుని ఉన్న భవనం నుంచి దుండగులు లోపలికి ప్రవేశించినట్టు గుర్తించారు. దొంగలు తమ వెంట తెచ్చుకున్న పోర్టబుల్ గ్యాస్ కట్టర్లతో తలుపులు పగలగొట్టారు. కాంక్రీట్ గోడకు కన్నం పెట్టి స్ట్రాంగ్ రూమ్ లోకి చొరబడ్డారు. అక్కడున్న దాదాపు 30 కేజీల నగలతో పాటు 5 లక్షల రూపాయల క్యాష్ తో పరారయ్యారు. కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు 200 మందితో 20 టీమ్ లు ఏర్పాటు చేసి నిందితుల కోసం వేట చేపట్టారు. ఎట్టకేలకు దుండగులు పోలీసుల చేతికి చిక్కారు. నిందితులను విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.