Dharmasthala Mass Burial Case: ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం.. 15 ప్రాంతాలను గుర్తించిన మాజీ శానిటరీ వర్కర్.. నెక్ట్స్ ఏం జరగనుంది?
తన 20 ఏళ్ల సర్వీసులో వందలాది శవాలను తాను ఖననం, దహనం చేశానని చెప్పాడు.

Dharmasthala Mass Burial Case: దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వందలాది మంది మహిళలు, మైనర్ల శవాలను పాతి పెట్టానని ఫిర్యాదు చేసిన మాజీ శానిటరీ వర్కర్ అందుకు సంబంధించి 15 ప్రాంతాలను గుర్తించాడు. నేత్రావతి నది ఒడ్డున, హైవేకు పక్కన ఈ ప్రాంతాలు ఉన్నాయి. మృతదేహాలు ఖననం చేయడంతో పాటు దహన సంస్కారాలకు సంబంధించిన 15 ప్రదేశాలను గుర్తించగా.. ఈ ప్రాంతాలన్నింటికి యాంటీ నక్సల్ ఫోర్స్ (ఏఎన్‌ఎఫ్)ను మోహరించారు.
ఇందులో మొదటి ఎనిమిది సైట్లు నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి. 9 నుండి 12 స్థానాలు నదికి సమీపంలో హైవే పక్కన ఉన్నాయి. 13వది నేత్రావతిని ఆజుకూరికి కలిపే రహదారిలో ఉంది. మిగిలిన 2 (14 15) హైవే సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి.
1998 నుంచి 2014 మధ్య వందలాది మృతదేహాలను తాను పూడ్చానని ఇటీవల అతడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కర్నాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఫిర్యాదుదారుడిని సిట్ అధికారులు రెండు రోజుల పాటు మంగళూరులో ప్రశ్నించారు. 1998 నుంచి 2014 మధ్య ధర్మస్థలలో మహిళలు, మైనర్ల మృతదేహాలను ఖననం, దహనం చేయాలని తనను బలవంతం చేశారని అతడు ఆరోపించాడు.
శని, ఆదివారాల్లో మల్లికట్టెలోని ఇంటెలిజెన్స్ బ్యూరో కార్యాలయంలో తన లాయర్లతో కలిసి అతడు వచ్చాడు. అతడి ముఖానికి నల్ల ముసుగు ధరించాడు. అతని స్టేట్‌మెంట్‌ను దర్యాప్తు అధికారి జితేంద్ర కుమార్ దయామా రికార్డ్ చేశారు. సిట్ చీఫ్ ప్రణవ్ మహంతి సైతం ఆదివారం విచారణలో పాల్గొన్నారు.
ధర్మస్థలానికి సంబంధించిన అన్ని అసహజ మరణాలు, అదృశ్యాలు, లైంగిక వేధింపుల కేసులను విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం జూలై 19న సిట్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే.
Also Read: దారుణం.. చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం.. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు విక్రయం..!
ధర్మస్థల.. కర్నాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం. పశ్చిమ కనుమల్లోని ఈ ప్రాంతం మంజునాథ స్వామి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామి దర్శనం కోసం తరలివస్తారు. అలాంటి ఈ పుణ్యక్షేత్రం ఒక్కసారిగా భయంకరమైన ఆరోపణలతో ఉలిక్కిపడింది. రెండు దశాబ్దాలుగా వందలాది మంది ఇక్కడ హత్యకు గురయ్యారని, లైంగిక వేధింపులు జరిగాయని ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.
”ధర్మస్థలలో వందలాది మంది హత్యకు గురయ్యారు.. ఆ శవాలను స్వయంగా నేనే ఖననం చేశా” అని మాజీ శానిటరీ వర్కర్ షాకింగ్ ఆరోపణలు చేశాడు. మంజునాథ ఆలయంలో 1995 నుంచి 2014 వరకు పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేసిన ఒక వ్యక్తి జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు భయంకరమైన ఫిర్యాదు చేశాడు.
తన 20 ఏళ్ల సర్వీసులో వందలాది మంది శవాలను తాను ఖననం, దహనం చేశానని చెప్పాడు. మృతదేహాల్లో ఎక్కువగా మహిళలు, మైనర్ బాలికలు ఉన్నారని వారిపై లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని అతడు ఆరోపించాడు.