Dog Attack: వీడిని ఏం చేసినా పాపం లేదు.. బాలుడిపై కుక్క దాడి.. నవ్వుతూ యజమాని పైశాచిక ఆనందం..

తనకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆ పిల్లవాడు వాపోయాడు. పైగా వారంతా నాపై కుక్క దాడిని వీడియో తీశారని తెలిపాడు.

Dog Attack: వీడిని ఏం చేసినా పాపం లేదు.. బాలుడిపై కుక్క దాడి.. నవ్వుతూ యజమాని పైశాచిక ఆనందం..

Updated On : July 21, 2025 / 12:35 AM IST

Dog Attack: ముంబైలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మానవత్వం లేకుండా వ్యవహరించాడు. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా తన పెంపుడు కుక్కతో దాడి చేయించాడు. అంతేకాదు.. కుక్క దాడితో పిల్లాడు భయంతో వణికిపోతుంటే.. గట్టి గట్టిగా కేకలు వేస్తుంటే.. అది చూసి నవ్వాడు. పైశాచిక ఆనందం పొందాడు. తనను కాపాడాలని పిల్లాడు ఆర్తనాదాలు చేస్తుంటే.. అతడేమో వినోదం చూసినట్లు చూశాడు. ఆగి ఉన్న ఆటోరిక్షా లోపల ఓ పిల్లాడు ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడిపై ఓ వ్యక్తి తన కుక్కను వదిలేశాడు.

ముంబై తూర్పు శివారు ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. పిట్ బుల్.. 11 ఏళ్ల బాలుడిపై దాడి చేసింది. ఆటోలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లాడు ఆటోలో వెనుక భాగంలో కూర్చుని ఉన్నాడు. అతడి పక్కనే కుక్క ఉంది. దాని యజమాని కూడా అక్కడే ఉన్నాడు. పిల్లాడు భయంతో కేకలు వేస్తుంటే ఆ నీచుడు అది చూసి తెగ ఆనందించాడు. దాడి చేస్తున్న కుక్కని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

కొన్ని సెకన్ల తర్వాత బాలుడి అరుపులు వినిపించాయి. కుక్క అతని గడ్డాన్ని కొరికేందుకు ఎగిరింది. ఏదో విధంగా పిల్లాడు కుక్క నుంచి తప్పించుకున్నాడు. ఆటో దిగేసి పరుగులు తీశాడు. కుక్క యజమాని పిల్లవాడికి సాయం చేయడానికి బదులుగా నవ్వుకుంటూ కూర్చున్నాడు. తన పెంపుడు శునకం బాలుడి వెంట పరిగెత్తటం చూసి నవ్వుతూ ఉండిపోయాడు.

”ఆ కుక్క నన్ను కరిచింది. తర్వాత నేను పారిపోయాను. అది నా వెంట పడింది. నా బట్టలు లాగింది” అని బాధిత బాలుడు కంటతడి పెట్టాడు. సాయం చేయమని ఎంతగానో వేడుకున్నా.. కుక్క యజమాని మాత్రం సాయం చేయలేదన్నాడు. పైగా నవ్వుకుంటూ అక్కడే ఉండి పైశాచిక ఆనందం పొందాడని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇంత జరుగుతున్నా.. తనకు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆ పిల్లవాడు బోరున విలపించాడు. పైగా వారంతా నాపై కుక్క దాడిని వీడియో తీశారని తెలిపాడు. కుక్క దాడితో చాలా భయం వేసిందన్నాడు బాలుడు. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కుక్క యజమాని మొహమ్మద్ సోహైల్ హసన్ (43) పై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు.

పిల్లాడు ఆటోలో కూర్చోవడమే అతడి పాలిట నేరమైంది. అమాయక పిల్లవాడిపై దాడి చేయడానికి సోహైల్ ఉద్దేశపూర్వకంగా తన పెంపుడు పిట్‌బుల్‌ను ఉపయోగించాడు. పిట్ బుల్ క్రూరమైన జాతికి చెందిన కుక్క. ఇది చాలా డేంజరస్. మనిషిపై దాడి చేసి చంపేస్తుంది. మార్చి 12, 2024న కేంద్రం నిషేధించాలని సూచించిన 23 క్రూరమైన జాతులలో పిట్‌బుల్స్ కూడా ఉన్నాయి. అంత ప్రమాదకరమైన కుక్కతో చిన్న పిల్లాడిపై నిర్దయగా దాడి చేయించిన వ్యక్తిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వాడసలు మనిషే కాదంటున్నారు. వాటిని అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.