జయరాం హత్యకేసులో విచారణకు ఎనిమిది టీమ్ లు : ఎస్పీ త్రిపాఠి
ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ జయరాం హత్యకేసులో విచారణకు హైదరాబాద్ కు ఎనిమిది టీమ్ లను పంపామని జిల్లా ఎస్పీ త్రిపాఠి తెలిపారు.

ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ జయరాం హత్యకేసులో విచారణకు హైదరాబాద్ కు ఎనిమిది టీమ్ లను పంపామని జిల్లా ఎస్పీ త్రిపాఠి తెలిపారు.
విజయవాడ : ఎన్ఆర్ఐ, పారిశ్రామిక వేత్త, ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్ ఛైర్మన్ జయరాం హత్యకేసులో విచారణకు హైదరాబాద్ కు ఎనిమిది టీమ్ లను పంపామని కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి తెలిపారు. ఈ కేసులో హైదరాబాద్ పోలీసుల సహకారం కూడా తీసుకుంటామన్నారు. జయరాం బంధువులందరితో మాట్లాడుతున్నామని చెప్పారు. అనుమానంతోనే విచారిస్తున్నాం…వారు నిందితులు కాదు అని అన్నారు.
హత్య జరిగిన ప్రాంతంలో ఫింగర్ ప్రింట్స్ సేకరించామని తెలిపారు. పోస్టుమార్టం జరిగే సమయానికంటే 24 గంటల ముందే జయరాం చనిపోయాడని ప్రాథమిక సమాచారమని చెప్పారు. నిందితులు తెలివిగా ఎలాంటి ఆధారాలు లేకుండా హత్య చేశారని పేర్కొన్నారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామన్నారు.
కృష్ణా జిల్లా, నందిగామ సమీపంలోని ఐతవరం గ్రామం శివారులో 65వ నెంబరు జాతీయరహదారి పక్కన శుక్రవారం తెల్లవారుజామున జయరామ్ మృత దేహం లభ్యమైంది. హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు వస్తుండగా ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. విజయవాడకు చెందిన జయరామ్.. భార్య పద్మజా ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. ఆయనకు బ్యాంకింగ్, ఫార్మా రంగాల్లో పలు వ్యాపారాలు ఉన్నాయి. కృష్టాజిల్లా కేంద్రంగా ఏర్పాటైన కోస్టల్ బ్యాంక్‌కు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.