సింగరేణిలో దళారీల దందా : కాసుల కోసం కక్కుర్తి
సింగరేణిలో దళారీల దందా నడుస్తోంది. ధనార్జనే ధ్యేయంగా వీరంతా ఇష్టారీతిన చెలరేగిపోయారు.

సింగరేణిలో దళారీల దందా నడుస్తోంది. ధనార్జనే ధ్యేయంగా వీరంతా ఇష్టారీతిన చెలరేగిపోయారు.
హైదరాబాద్ : సింగరేణిలో దళారీల దందా నడుస్తోంది. ధనార్జనే ధ్యేయంగా వీరంతా ఇష్టారీతిన చెలరేగిపోయారు. కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన కార్మిక సంఘాల నాయకులు కూడా కాసుల కోసం కక్కుర్తి పడ్డారు. ఇలాంటివారిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కారుణ్య నియామకాలను కొందరు దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. కార్మిక కుటుంబాల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అడ్డంగా దోచేస్తున్నారు. కీలకమైన మెడికల్ బోర్డును అడ్డాగా చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో… అనారోగ్యంతో కొందరు, ప్రమాదాల బారినపడి మరికొందరు విధులకు దూరం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. అలాంటివారిని గుర్తించి వారి వారసులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలివ్వాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. అన్‌ఫిట్ కార్మికులను గుర్తించేందుకు సింగరేణి డైరెక్టర్‌తోపాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఇద్దరు నిమ్స్ స్పెషలిస్టు వైద్యులున్న బృందం కొత్తగూడెం ఆస్పత్రిలో 29సార్లు మెడికల్ బోర్డులను నిర్వహించింది. వీటికి మొత్తం 4వేల మంది కార్మికులు హాజరయ్యారు. అందులో 2వేల మందిని అన్‌ఫిట్‌గా గుర్తించి… వారి వారసులకు ఉద్యోగ నియామకాల కోసం ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడే దళారులు దందాకు తెరలేపారు. అన్‌ఫిట్ సర్టిఫికెట్లు ఇప్పిస్తామని కార్మిక సంఘాల నాయకులు రంగంలోకి దిగారు. ఒక్కో కార్మికుడి నుంచి 5 నుంచి 15లక్షల రూపాయల వరకు వసూళ్లు చేశారు. ఇందులో వైద్యులతోపాటు సింగరేణి డైరెక్టర్‌కు కూడా హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలైన అన్‌ఫిట్ కార్మికులకు కాకుండా డబ్బులిచ్చినవారికే ప్రాధాన్యత ఇచ్చారని కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
అక్రమార్కుల భరతం పట్టేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ, విజిలెన్స్ అధికారులు.. బాధ్యులైన 23మంది కార్మికులకు ప్రమేయం ఉందని తేల్చారు. దీంతో సింగరేణి అధికారులు.. వారిని ఇతర ప్రాంతాలకు బదిలీచేశారు. ఓ దళారీ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఇంతవరకు కొత్తగూడెంలోని అక్రమాలపైనే నిఘాపెట్టిన ఏసీబీ.. ప్రస్తుతం అన్నిఏరియాలపై ఫోకస్ పెట్టింది. కార్మిక సంఘాల లీడర్లు, మెడికల్ అధికారుల కాల్ డేటాపై దృష్టిపెట్టారు… దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అటు ఏసీబీ చర్యలపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు… చిన్న ఉద్యోగులపై మాత్రమే కాకుండా.. పెద్దవారిపైనా దృష్టిపెట్టాలని కోరుతున్నారు. కార్మిక సంఘాల నాయకులు, అధికారులపై కూడా నిఘా పెడితే ఈ స్కామ్‌తో సంబంధమున్న వారందరి వివరాలు బయట పడతాయని అంటున్నారు.