గచ్చిబౌలీలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి

  • Published By: murthy ,Published On : December 13, 2020 / 11:22 AM IST
గచ్చిబౌలీలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి

Updated On : December 13, 2020 / 11:31 AM IST

road accident at Hyderabad,Gachibowli : ఆదివారం తెల్లవారుఝూమున గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గచ్చిబౌలీలోని  విప్రో  సర్కిల్ వద్ద టిప్పర్ లారీ, ఓ కారును ఢీ కొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా. మరోక వ్యక్తి ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో కన్నుమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కారును అతివేగంగా నడపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ అతిక్రమించటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

మాదాపూర్ లోని ఓ హాస్టల్ లో ఉండే కాట్రగడ్డ సంతోష్ ,భరద్వాజ్, పవన్,రోషన్, మనోహర్ లు ఆదివారం తెల్లవారు ఝూమున AP 39ED 5229 నెంబరు గల కారులో గచ్చి బౌలీనుంచి గౌలిదొడ్డి వైపు బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్నకారు అతివేగంతో విప్రో సర్కిల్ వద్ద రెడ్ సిగ్నల్ ను క్రాస్ చేసింది. అదే సమయంలో అటునుంచి వచ్చిన టిప్పర్…కారును ఢీ కొట్టటంతో రెండు వాహనాలు రోడ్డుపై పల్టీలు కొట్టాయి. కారు ఎగిరి పడటంతోనే రోడ్డు పక్కన తాగునీటి కోసం ఏర్పాటు చేసిన షెడ్డు పై పడటంతో అది ధ్వంసం అయ్యింది. కారు నుజ్జు నుజ్జు కాగా, మృతుల శరీరల భాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. మరణించినవారంతా ఆంధ్రప్రదేశ్ కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

మరణించిన వారిలో కాట్రగడ్డ సంతోష్ పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయి గూడెంకు చెందిన వ్యక్తి. హైదరాబాద్ లోని టెక్ మహీంద్రాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. మృతుల్లో మరొకరైన చింతా మనోహర్‌ తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లికి చెందిన యువకుడు కాగా, పవన్‌ కుమార్ నెల్లూరు జిల్లా వేదాయపాలెంనకు…. పప్పు భరద్వాజ్‌ విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌కు చెందిన వాసిగా పోలీసులు నిర్థారించారు.‌ నాగిశెట్టి రోషన్‌ స్వస్థలం నెల్లూరుగా పోలీసులు తెలిపారు.