Odisha : మద్యం తాగటానికి రూ.100 ఇవ్వలేదని, మాజీ వైస్ చాన్సలర్ హత్య
మద్యం తాగడానికి రూ.100లు ఇవ్వలేదని ఓ యువకుడు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ను దారుణంగా హత్య చేసిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది.

Ex Vc Dhruva Raj Naik Murdered
Odisha : మద్యం తాగడానికి రూ.100లు ఇవ్వలేదని ఓ యువకుడు యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. ప్రోఫెసర్ ధ్రువరాజ్ నాయక్ అనే వ్యక్తి సంబల్పూర్ విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ గా పని చేసి రిటైరయ్యారు.
రిటైరైన తర్వాత ఆయన జార్సుగూడ జిల్లా కౌరాముల్ గ్రామంలో నివసిస్తున్నారు. ఆదివారం ఉదయం 11-30 సమయంలో ఆయన ఇంట్లోకి మద్యం సేవించిన 20 ఏళ్ల యువకుడు ప్రబిన్ ధారువా వచ్చాడు. ఆ సమయంలో ఆయన బయటకు వెళ్లారు. ఇంటికి వచ్చే సరికి ప్రబిన్ ధారువా నాయక్ బెడ్ రూం లో ఉన్నాడు. తన అనుమతిలేకుండా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని ఆయన గద్దించారు.
అప్పటికే ప్రబిన్ ధారువా మద్యం సేవించి ఉన్నాడు. ఇంట్లోకి వచ్చిన యువకుడు, మద్యం సేవించటానికి 100 రూపాయలు ఇవ్వాలని నాయక్ ను కోరాడు. అందుకు ఆయన నిరాకరించాడు. ప్రబిన్ ధారువా అక్కడే ఉన్నగొడ్డలితో నాయక్ పై దాడి చేసి పరారయ్యాడు.
దాడిలో తీవ్రంగా గాయపడిన నాయక్ ను సమీపంలోని జిల్లా అస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు అప్పటికే మరణించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు ప్రబిన్ ధారువాను అరెస్ట్ చేశారు.
పర్యావరణ వేత్త అయిన నాయక్ రిటైర్ అయిన తర్వాత స్వగ్రామానికి వచ్చి అడవుల పెంపకం చేపట్టారు. అందుకోసం గ్రామంలో చెరువుకు సంబంధించిన వివాదం ఒకటి నడుస్తోంది. ఆవిషయమై ఇరు వర్గాలు లైకేరా పోలీసు స్టేషన్ లో కేసు పెట్టాయి. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని జర్సుగూడ ఎస్పీ బికాస్ చంద్రదాస్ చెప్పారు.