తమిళనాడులో దూసుకెళ్లిన లారీ : నలుగురు మృతి, 7గురికి గాయాలు

Four killed Seven injured after truck rams into vehicles in Dharmapuri : తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీ బ్రేకులు ఫెయిలవటంతో వాహనాలపైకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. 14 వాహనాలు ధ్వంసం అయ్యాయి. రోడ్డుపై దృశ్యాలు హృదయవిదారకంగా మారాయి . రోడ్డుపై మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.
సేలం-బెంగుళూరు జాతీయ రహదారిపై ధర్మపురి జిల్లాలో తోప్పూరు వద్ద శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో రెండు వాహానాలు ఢీకొని ప్రమాదం జరిగింది. పోలీసులు, జాతీయ రహాదారి సిబ్బంది ఆ వాహనాల్ని పక్కకు తీసే క్రమంలో కొంత ట్రాఫిక్ జాం అయ్యింది. నెమ్మదిగా వాహనాలను ఒక మార్గం గుండా పంపిస్తున్నారు.
అదే సమయంలో ఏపీనుంచి భారీ సిమెంట్ లోడ్ తో అదే రహదారిపై వెళుతున్న భారీ లారీ అదుపు తప్పి వాహనాలపై దూసుకు వెళ్లింది. ఈఘటనలో 12 కార్లు, ఒక మినీ వ్యాను, ఓట్రక్కు, మోటారు సైకిలు ధ్వంసం అయ్యాయి. ఈఘటనలో నలుగురు మరణించగా, 7గురు తీవ్రంగా గాయపడ్డారు.
మరణించిన వారిని పెరుంపలైకి చెందిన ఎ మాధవ్ కుమార్ (32), కన్నన్ (26), కోయంబత్తూరుకు చెందిన నిత్యానంద, ఓమలూర్‌కు చెందిన కార్తీక్ అనే వారుగా గుర్తించారు. మృతదేహాలను ధర్మపురి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడినవారికి ప్రభుత్వ మోహన్ కుమారమంగళం వైద్య కళాశాల, ధర్మపురి వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ తప్పించుకు పారిపోయాడు. జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్తీక , ఎస్పీ సి.ప్రవేష్ కుమార్ ఘటనా స్ధలాన్నిసందర్శించి సహయక చర్యలను పర్యవేక్షించారు. ఈప్రమాదం వల్ల సుమారు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.