సత్తెనపల్లి ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లో ఘరానా మోసం.. షాక్‌లో కస్టమర్లు.. అసలేం జరిగిందంటే..
ఇదే తరహాలో మరో ముగ్గురు కూడా బ్రాంచ్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ఆ బ్రాంచ్ లో దాదాపు రూ.40 లక్షల మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

Gold Loan Fraud : కూలీ నాలి చేసి రూపాయి రూపాయి కూడబెట్టుకున్నారు. ఆ పైసలతో కొద్దిపాటి బంగారాన్ని తయారు చేయించుకున్నారు. కుటుంబ అవసరాల కోసం గోల్డ్ తాకట్టు సంస్థలో పెట్టుకుని డబ్బు తెచ్చుకున్నారు. అయితే, ఇదే అదనుగా చేసుకున్న కొందరు సిబ్బంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వేరే ఆధార్ కార్డుదారుల పేరుతో రిజిస్ట్రర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు నొక్కేశారు. ఈ ఘటన సత్తెనపల్లి పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో వెలుగుచూసింది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ లో ఘరానా మోసం బయటపడింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన గోల్డ్ ని వేరే ఖాతాదారుల పేరుతో రిజిస్ట్రర్ చేసినట్లుగా తెలుస్తోంది. కుటుంబ అవసరాల కోసం వినియోగదారులు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని డబ్బు తెచ్చుకున్నారు. అయితే, ఇదే అదనుగా చేసుకుని కొందరు ఉద్యోగులు ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేరే ఆధార్ కార్డుదారుల పేరుతో రిజిస్ట్రర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు వెల్లడైంది.
ముత్తూట్ ఫైనాన్స్ లో బంగారం పెట్టుకుని నెలలు గడిచినా ఖాతాదారులకు గోల్డ్ పెట్టుకున్నట్లు రసీదులు ఇవ్వకుండా కాలయాపన చేశారు బ్రాంచ్ సిబ్బంది. కస్టమర్ గోల్డ్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆన్ లైన్ పని చేయడం లేదని చెప్పి తిప్పుకున్నారు. అయితే, ఓ కస్టమర్ బ్రాంచ్ సిబ్బందిని గట్టిగా నిలదీయడంతో అసలు మీ పేరు మీదు గోల్డ్ రిజిస్ట్రర్ లో లేదని, వడ్డీ ఎక్కువ కట్టాలని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బాధితులు కంగుతిని పోలీసులను ఆశ్రయించారు.
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నె పాడు గ్రామానికి చెందిన వెల్లంపల్లి విజయ్ కుమార్ 20 గ్రాముల బంగారు ఆభరణాలను కుదవ పెట్టి గత ఏప్రిల్ 19న రూ.60వేలు తీసుకున్నాడు. ఆయన భార్య 33.5 గ్రాముల బంగారు ఆభరణాలు కుదవ పెట్టి మరో లక్ష 20 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. 20గ్రాములకు 98వేలు, 33.5 గ్రాములకు లక్షా 60వేల 50 రూపాయలు చెల్లించాలని చెప్పడంతో విజయ్ కుమార్ షాక్ తిన్నాడు. ఎందుకు చెల్లించాలని ప్రశ్నించడంతో బ్రాంచ్ మేనేజర్ ఆది నారాయణకు, విజయ్ కుమార్ కు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతీ నెల వడ్డీ చెల్లిస్తున్నా ఎక్కువ మొత్తంలో చూపుతు అవకతవకలు సిబ్బంది పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు.
‘నేను నాలుగు గోల్డ్ ఐటెమ్స్ పెట్టాను. రెండు ఐటెమ్స్ తీసుకున్నాను. మరో రెండు ఉన్నాయి. ఆ రెండు ఐటెమ్స్ తాలూకు ఒక లక్ష 60వేలు కట్టాలి. దానికి బదులుగా సిబ్బంది 2 లక్షల 80వేలు కట్టాలని చెబుతున్నారు. నాకు న్యాయం చేయండి. మేనేజర్ సరిగా స్పందించడం లేదు. నేను పెట్టిన రెండు వస్తువుల్లో ఒకటి నా అకౌంట్ లో ఉంది. మరొకటి వేరే వాళ్ల అకౌంట్ లో ఉంది. నేను కుదవ పెట్టింది ఏప్రిల్ 19 2024. కానీ, వేరే వాళ్ల అకౌంట్ లో ఉన్నది మాత్రం సెప్టెంబర్ 26వ తారీఖు. ఆ రోజు నేనసలు ముత్తూట్ ఫైనాన్స్ కే రాలేదు’ అని ఓ బాధితుడు వాపోయారు.
ఇదే తరహాలో మరో ముగ్గురు కూడా బ్రాంచ్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు ఆ బ్రాంచ్ లో దాదాపు రూ.40 లక్షల మోసం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ గోల్డ్ స్కామ్ లో ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ, ఉద్యోగి గోపీ పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు వెంటనే ఇందులో జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
Also Read : అసలేంటి బిట్ కాయిన్? దీన్ని సాధించడం ఎలా? ఇందులో పెట్టుబడులు పెట్టడం సేఫేనా..