రూ.1.93కోట్లు సీజ్ : పంచాయతీ ఎన్నికల్లో భారీగా నగదు, మద్యం స్వాధీనం
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భారీగా నగదు, మద్యం పట్టుబడింది.

రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భారీగా నగదు, మద్యం పట్టుబడింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం పెద్దమొత్తంలో కనిపించింది. భారీగా నగదు, మద్యం పట్టుబడింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.రెండున్నర కోట్లకు పైగా విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.1.93 కోట్ల నగదు, రూ.52 లక్షల విలువ చేసే మద్యం, ఇతర వస్తువులున్నాయి. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు పోలీస్ శాఖ ఓ నివేదిక అందించింది.
రాష్ట్రంలో మూడు విడతలుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు పోలీసులు, ఎన్నికల అధికారులు నిర్వహించిన సోదాల్లో డబ్బు, మద్యం, ఇతర వస్తువులు దొరికాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలతో సహా మొత్తం 485 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి, 202 కేసుల్లో పోలీసులు చర్యలు ప్రారంభించారు.
ఇప్పటివరకు 447 ఫిర్యాదులు దాఖలు కాగా రాజకీయ పార్టీలు, అభ్యర్థుల మధ్య సంబంధాలున్న ఉదంతాలు 44 గుర్తించారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా రూ.1.19కోట్ల మేర నగదు పట్టుకున్నారు. రాచకొండ, సైబరాబాద్ పరిధిలో రూ.22 లక్షలు, వనపర్తి జిల్లాలో రూ.20.39 లక్షలు, జగిత్యాల జిల్లాలో రూ.10లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా రూ.20 లక్షల విలువైన మద్యం, జగిత్యాల జిల్లాలో రూ.8 లక్షల విలువ చేసే మద్యం, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జనవరి 26 శనివారం రోజున రూ.ఏడున్నర లక్షల నగదుతోపాటు వందల లీటర్లకు పైగా మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇందులో అత్యధికంగా రూ.5 లక్షలకు పైగా నగదు కామారెడ్డి జిల్లాలో దొరకడం గమనార్హం. వనపర్తి, కరీంనగర్ జిల్లాల్లో మధ్యం అధికంగా పట్టుబడింది. 52 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా 17 కేసుల్లో పోలీసులు చర్యలు తీసుకున్నారు. శనివారం ఒక్కరోజే 27 ఫిర్యాదులు అందాయి.